రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు మొత్తం 420 హామీలను ఇచ్చిందని, వాటిని నమ్మి ప్రజలు ఓటేశారని ఆయన గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చాక “ఖజానా ఖాళీగా ఉంది” అంటూ సాకులు చెబుతూ హామీల అమలు నుంచి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఒకవైపు రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని చెబుతూనే, మరోవైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి అవసరమైతే రూ. 1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటించడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. “రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబులు ఫుల్” అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంపదపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు రూ. 12 లక్షల కోట్ల నిధులను అందించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వాస్తవాలను దాచకుండా బహిరంగ పరచాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

