చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవ దహనం
ఈజిప్టులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రాజధాని కైరో నగరం ఇన్ బాబా ప్రాంతంలోని అబూ సిఫీన్ అనే చర్చిలో ఆదివారం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 41 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో 14 మందికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని, తప్పించుకునేందుకు మార్గం లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 15 అగ్నిమాపక దళాలతో మంటలను ఆర్పారు. క్షతగాత్రులను 30 అంబులెన్సులలో ఆస్పత్రులకు తరలించామని ఈజిప్ట్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. తొమ్మిది కోట్ల మంది జనాభా గల ఈజిప్టులో క్రిస్టియన్లు 10 శాతం మంది ఉన్నారు.