చెట్ల పొదల్లో చిన్నారి.. తమిళనాడులో ఘోరం
తమిళనాడులోని కడలూరులో దారుణం జరిగింది. 11వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్లోనే ప్రసవించింది. తర్వాత శిశువును స్కూలు పక్కనే ఉన్న పొదల్లో పడేయడంతో శిశువు మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడలూరు జిల్లా, భువనగిరిలోని పాఠశాల సమీపంలో ఉన్న పొదల్లో ఒక చిన్నారి మృతదేహాన్ని కొందరు విద్యార్థులు గుర్తించారు.

ఈ విషయాన్ని పాఠశాల నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారికి పేగుతాడు కూడా సరిగ్గా తెంచలేదని గుర్తించారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం స్కూలు ఆవరణలోనే ఆ శిశువును ప్రసవించినట్లు గుర్తించారు. వెంటనే స్కూల్లోని విద్యార్థుల్ని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని ఆ బిడ్డకు జన్మనిచ్చినట్లు గుర్తించారు. పోలీసులు ఆ విద్యార్ధినిని అదుపులోకి తీసుకొని విచారించారు. తాను స్కూల్ బాత్‌రూమ్‌లో బిడ్డను ప్రసవించినట్లు, అనంతరం చిన్నారిని స్కూలు పక్కనున్న పొదల్లో వదిలేసి వెళ్లినట్లు తెలిపింది.
అయితే తాను గర్భం దాల్చడానికి వేరే ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న అబ్బాయి కారణమని ఆమె చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఘటనకు బాధ్యుడైన బాలుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.

