NationalNews

ములాయంకు ప్రధాని పదవి అందని ద్రాక్షే..!

రాజకీయ దిగ్గజుడు ములాయం సింగ్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంలోనూ చక్రం తిప్పారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి చెందిన ఈ నాయకుడు ఎక్కువ ఎంపీ స్థానాలను తన గుప్పిట్లో పెట్టుకొని కేంద్రంలో కీలక పదవులు పొందారు. కేంద్ర రక్షణ మంత్రిగానూ పని చేశారు. అయితే.. ఒక పదవి మాత్రం ఆయనకు అందనంత దూరంగానే మిగిలిపోయింది.

రక్షణ మంత్రిగా..

సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా నిలిచిన ములాయం మెయిన్‌పురి నియోజకం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. అంతకుముందు ఆజమ్‌గఢ్‌, సంభాల్‌ నుంచి కూడా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో మెయిన్‌పురి నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికైన ములాయం.. యునైటెడ్‌ ఫ్రంట్‌ సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1998, 1999లో సంభాల్‌ నుంచి ఎంపీగా గెలిచారు. 1989, 1999లో ప్రధాని పదవి ములాయంకు అతి సమీపంలోకి వచ్చింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శరద్‌ యాదవ్‌ వ్యతిరేకించడంతో ఆయన ప్రధానమంత్రి కాలేకపోయారు. కింగ్‌ మేకర్‌గా మాత్రం చక్రం తిప్పారు.

పక్కా సెక్యులరిస్టు..

సెక్యులరిస్టుకు మారుపేరుగా నిలిచిన ములాయం ఒకానొక దశలో కరసేవకులపై కాల్పులకూ వెనుకాడలేదు. బాబ్రీ మసీదు వద్దకు బయల్దేరిన అయోధ్య కరసేవకులపై కాల్పులు జరిపించి పలువురి మృతికి కారకుడయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారు. దీంతో హిందూ వ్యతిరేకిగా ముద్ర పడినా డోంట్‌ కేర్‌ అంటూ యాదవ-ముస్లింల ఓట్లతో మరోసారి యూపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తాను రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నానని.. ఒక పార్టీ బెదిరింపులకు భయపడేది లేదని తెగేసి చెప్పడం ములాయంకే చెల్లింది.