ఏపీ హాస్టల్ విద్యార్థులకు “గోల్డెన్ అవర్”
ఏపీ రాష్ట్రంలో సంక్షేమ వసతిగృహాలలోని విద్యార్థుల ఆరోగ్యం కోసం ‘గోల్డెన్ అవర్ బీమా’ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేశ్‌కుమార్ చొరవతో ఈ కార్యక్రమం జిల్లాలో అమలుచేయాలని నిర్ణయించారు. దీనికోసం ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుని ఏడాదికి రూ.200 ప్రీమియంతో రూ.50 వేల రూపాయల బీమా సదుపాయం కల్పిస్తున్నారు. ఈ ప్రీమియం సొమ్మును కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ‘వేదాంత’ సంస్థ నుండి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీనికోసం ఏడాదికి రూ.20 లక్షల వరకూ ఖర్చు అవుతోంది. కోనసీమ జిల్లాలో 94 హాస్టళ్లలో 8,384 మంది పిల్లలకు బీమా సదుపాయం చేకూరనుంది. ఈ పిల్లలకు ఏ రకమైన ఆరోగ్యసమస్యలు వచ్చినా ఈ ఆరోగ్య బీమా సహాయంతో చికిత్స అందించవచ్చు. జ్వరాలు, దెబ్బలు, యూరినరీ ఇన్‌ఫెక్షన్లు, చర్మ సమస్యలు వంటి 20 రకాల వ్యాధులను ఈ బీమాలో చేర్చారు.

