పోలీస్ స్టేషన్‌లోనే వివాహిత సజీవదహనం
విశాఖపట్నం మనసర్కార్
విశాఖ ఎంవీపీ కాలనీలో దారుణం జరిగింది. శ్రావణి అనే వివాహిత పోలీసు స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు జీవితాన్నే బలిపెడతాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన శ్రావణికి, విశాఖకు చెందిన వినయ్‌తో నాలుగునెలల క్రిందటే వివాహం జరిగింది. మొదటినుండీ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనితో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈరోజు ఉదయం ఆమె భర్తను, ఆమెను పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరికీ ఎస్సై శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తుండగా.. హఠాత్తుగా శ్రావణి ఫోన్‌లో మాట్లాడుతూ బయటకి వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సందర్భంలో పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఎస్సై చేతికి కూడా గాయాలయ్యాయి. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని శ్రావణి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

