నేడు అసెంబ్లీలో కీలక చర్చ
◆ మూడు రాజధానుల అంశంపై సుదీర్ఘ చర్చ
◆ పరిపాలనా వికేంద్రీకరణ చర్చను అడుగడుగునా అడ్డుకున్న టీడీపీ సభ్యులు
◆ స్పీకర్ పోడియం చుట్టుముట్టే ప్రయత్నం సభను 10 నిమిషాల పాటు వాయిదా వేసిన స్పీకర్
◆ సభ సజావుగా సాగేలా సహకరించాలని టీడీపీ సభ్యులను కోరిన సీఎం జగన్
ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తొలిరోజు వాడేవేడిగా జరిగాయి. ఉదయం 9 గంటలకే ప్రారంభమైన తొలి రోజు సభ 55 నిమిషాలకే వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు వాగ్వావాదానికి దిగడంతో సభను 10.15 వరకు స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన సభ మరో మారు 20 నిమిషాలకే వాయిదా పడింది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సందర్భంలో సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని సీఎం జగన్ టీడీపీ సభ్యులను కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. అనంతరం సమావేశాల్లో చర్చించాల్సిన వివిధ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.

మధ్యాహ్నం 12.20 నిమిషాలకు సభ తిరిగి ప్రారంభమైంది. పరిపాలన వికేంద్రీకరణ పై చర్చ జరిగే సందర్భంలో టీడీపీ సభ్యులు అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం ను ముట్టడించారు. పరిపాలన వికేంద్రీకరణ చర్చపై టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డుకున్నారు. చర్చ జరిగినంత సేపు ఆటంకం కలిగిస్తూ వచ్చారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ సభ్యులు టీడీపీపై ఎదురుదాడికి దిగారు. దీంతో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగినంత సేపు సభలో తీవ్ర రగడ చోటు చేసుకుంది. సాయంత్రం నాలుగు గంటలకు టీడీపీ సభ్యులను సభ నుండి ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. తొలిరోజు సమావేశాల్లో టిడిపి సభ్యుల వ్యవహార సరళి పై స్పీకర్ తమ్మినేని పలుమార్లు మండిపడ్డారు.

