Telangana

RRRకు నాలుగో R తోడవుతుంది

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో మూడు ఆర్‌లకు నాలుగో ఆర్‌ తోడవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఓటరును కలిసి బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. హోటల్లో టీ తాగుతూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో బీజేపీకి మంచి స్పందన వస్తోందని తెలిపారు. డబ్బు అనే అహంకారంతో విర్రవీగుతున్న టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మునుగోడు ఉప ఎన్నికల తీర్పు ఒక గుణపాఠం అవుతుందని తెలిపారు. దుబ్బాకలో తాను గెలిస్తే ప్రగతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ బయటకు వచ్చారని.. హుజూరాబాద్‌లో గెలిస్తే ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చారని.. ఇప్పుడు మునుగోడులో గెలిస్తే ప్రజల వద్దకు వస్తారని పేర్కొన్నారు. అంతకుముందు వివిధ గ్రామాలకు చెందిన పలువురు రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు.