లీవు దొరకని కారణంగా బిడ్డను కోల్పోయిన కానిస్టేబుల్
ఉద్యోగులు అవసరాలకు సెలవులు తీసుకోవడం మామూలే. అధికారులు ఆ సెలవులు మంజూరు చేయకపోవడం కూడా షరా మామూలే. కానీ ప్రాణాలమీదికొచ్చే పరిస్థితుల్లో కూడా సెలవు ఇవ్వకపోవడం అమానుషం అనే చెప్పాలి. ఇలాంటి దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సెలవు ఇవ్వని కారణంగా ఓ కానిస్టేబుల్ తన రెండేళ్ల బాబును కోల్పోవలసి వచ్చింది. తన భార్యకు శస్త్రచికిత్స జరగడంతో, రెండేళ్ల బాబును చూసుకోవడానికి ఎవరూ లేరని సెలవు కావాలని ఈ నెల 7న తన పై అధికారులను అభ్యర్థించారు సోనూ చౌదరి. ఈయన బైద్పుర్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. వారు సెలవు ఇవ్వకపోవడంతో విధులకు హాజరు కావల్సి వచ్చింది. ఆయన భార్య అనారోగ్యంతో ఉంది. రెండేళ్ల కుమారుడు హర్షిత్ ఆడుకుంటూ ఇంటి ముందున్న నీటిగుంటలో పడిపోయాడు. బిడ్డ ఎంతకీ తిరిగి రాకపోవడంతో వెతుకుతూ వెళ్లి చూడగా, నీటిగుంటలో విగత జీవిగా కనిపించాడు. తనకు సెలవు ఇవ్వక పోవడం వల్లే ఇదంతా జరిగిందని, సాక్ష్యంగా బిడ్డ మృతదేహంతో SSP కార్యాలయానికి వెళ్లాడు. సోనూచౌదరి. ఎస్పీ వెంటనే స్పందించి, విచారణకు ఆదేశించాడు. ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది.

