‘ఆ ఏజ్‌లో ఏ అమ్మాయీ దీనికి ఒప్పుకోదు’..సుకుమార్ భార్య
టాలీవుడ్ సక్సెస్‌పుల్ డైరక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి గురించి మాట్లాడుతూ సుకుమార్ భార్య తబిత ఎంతో ఎమోషనల్ అయ్యింది. కేవలం 13 ఏళ్ల వయసులో సుకృతి ఏ అమ్మాయీ చేయని త్యాగం చేసిందని, ఈ చిత్రం కోసం గుండు చేయించుకుందని పేర్కొన్నారు. సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాంధీ తాత చెట్టు’ అనే చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు అందుకుంది. గురువారం నాడు ఈ చిత్రం రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సుకుమార్ దంపతులు. ఈ సందర్భంగా సుకుమార్ సతీమణి తబిత మాట్లాడుతూ “సుకృతికి యాక్టింగ్ రాదనుకున్నాను. తను పాటలు బాగా పాడుతుంది. డైరక్టర్ పద్మావతి మల్లాది సుకృతిని నమ్మి, తనలోని టాలెంట్‌ను బాగా ఉపయోగించింది. సుకృతి ఈ చిత్రాన్ని ఒప్పుకున్నప్పుడు 13 ఏళ్ల వయసులో ఏ అమ్మాయీ చేయని పని చేసింది. ఈ చిత్రం కోసం గుండు చేయించుకుంది. ఈ విషయంలో తనను చూసి గర్విస్తున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యింది. దీనితో సుకుమార్ ఆమెను ఓదార్చారు. ఈ చిత్రానికి తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం జనవరి 24న థియేటర్లలో విడుదల కాబోతోంది.

