మీడియాపై ఇజ్రాయెల్ ఆంక్షలు
ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య పోరు కొనసాగుతోంది. ఈనేపథ్యంలో టెల్‌అవీవ్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజాతో యుద్ధంలో పాల్గొంటున్న తమ సైనికులు విచారణను ఎదుర్కొనే అవకాశం ఉండటంతో.. మీడియాపై ఆంక్షలు విధించింది. ఇటీవల ఇజ్రాయెల్‌కు చెందిన ఓ రిజర్వ్ సైనికుడు బ్రెజిల్ లో పర్యటించారు. కొందరు పాలస్తీనా మద్దతుదారులు అతడిని గుర్తుపట్టి ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని విచారించాలని ఫెడరల్ పోలీసులను బ్రెజిల్ జడ్జి ఆదేశించారు. ఈవిషయం కాస్తా ఆ సైనికుడికి తెలియడంతో ఆకస్మికంగా దేశాన్ని వీడాడు. ఈ నేపథ్యంలోనే ఇకపై తమ సైనికుల పేర్లు, ముఖాలను పూర్తిగా చూపించకూడదని ఇజ్రాయెల్ మీడియాను ఆదేశించింది. కల్నల్ అంతకంటే తక్కువ స్థాయి సైనిక అధికారులకు ఈ నిబంధన వర్తిస్తోంది. పైలెట్‌లు, ఇతర విభాగ దళాలకు ఇప్పటికే పలు నిబంధనలు ఉన్నాయి.

