అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..ఈసారి కమలా హారిస్ టార్గెట్..
అమెరికాలో తుపాకుల సంస్కృతి మరోసారి విజృంభించింది. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరగడం కలకలం సృష్టిస్తోంది. అరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. గతంలో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కూడా రెండుసార్లు హత్యాయత్నం జరగడం, ఇప్పుడు తాజాగా కమలా హారిస్ కార్యాలయంపై కాల్పులు జరగడం కలకలం సృష్టిస్తోంది. కార్యాలయం కిటికీల వద్ద నుండి కాల్పులు జరిపినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సమయానికి అక్కడ వ్యక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ మధ్య కమలాహారిస్, ట్రంప్ మధ్య డిబేట్ జరిగిన సంగతి తెలిసిందే. దానిలో కమలాహారిస్ పైచేయి సాధించినట్లు అధిక సంఖ్యాకులు అభిప్రాయపడ్డారు. ఈ మధ్య చికాగో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సర్వేలో ఆసియా అమెరికన్ ఓటర్లలో 66 శాతం మంది హారిస్‌కు, 28 శాతం మంది ట్రంప్‌కు మద్దతుగా నిలిచినట్లు తెలిసింది. ఈ నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
మరోపక్క కమలాహారిస్ ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. దాదాపు 21 మిలియన్ల మంది ఉగ్రవాదులను ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలాహారిస్ అనుమతించించారని తాజాగా ట్రంప్ ఎక్స్ ఖాతాలో ఆరోపణలు చేశారు. వారంతా దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.


 
							 
							