వినాయక చవితి వ్రతం ఏ సమయంలో చేసుకోవాలి?
వినాయక చవితి వచ్చిందంటే పిల్లలందరకీ ఎంతో సంతోషం. వినాయకుని విగ్రహం తేవడం దగ్గరనుండి నిమజ్జన కార్యక్రమం వరకూ సందడిగా హల్‌చల్ చేస్తూంటారు. భాద్రపద శుద్ధ చవితి దినాన మనం వినాయక చవితి పండుగ చేసుకుంటాం. అయితే ఈ సంవత్సరం చవితి తిధి 6,7 రెండు తేదీలలో ఉంది. కానీ ధృక్ సిద్దాంతం ప్రకారం శనివారం 7వతేదీనే చవితి పండుగను జరుపుకోవాలని నిర్ణయించారు పండితులు. చవితి ఉదయం 11.03 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల మధ్యలో వినాయకుని విగ్రహ ప్రతిష్టాపనకు శుభముహూర్తమని పేర్కొన్నారు. అలాగే మండపాలలో సాయంత్రం 6.22 గంటల నుండి రాత్రి 7.30 గంటల మధ్య కాలంలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పాన్ని చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక ఇళ్లలో జరుపుకునే వినాయక చవితి వ్రతం కుటుంబ సంప్రదాయాలను బట్టి, వారి విధానాలను బట్టి జరుపుకోవచ్చు. గణపతి విద్యాధిదేవతగా పూజింపబడతారు. చదువుకునే పిల్లలందరూ తమకు చదువు బాగా రావాలని కోరుకుంటూ, పుస్తకాలను గణపతి మండపంలో పెట్టి పూజిస్తారు. కొత్తగా పనులు ప్రారంభించేవారు పనులలో ఏ రకమైన విఘ్నాలు కలుగకూడదని గణపతిని ప్రార్థిస్తారు. వినాయక చవితి పూజ చేసి, కథను చెప్పుకుని అక్షింతలు తలదాల్చడంతో పూజ పూర్తవుతుంది. ఉండ్రాళ్లు, కుడుములు వంటి నైవేద్యాలతో గణపతిని సంతృప్తి పరచి, పండితులకు వాయినాలు సమర్పిస్తారు.


