జైలులో తొక్కిసలాట.. 129 మంది మృతి
సెంట్రల్ ఆఫ్రికాలోని కాంగో రాజధాని నగరం కిన్షాసాలోని మకాలా ప్రధాన జైలులో భారీ తొక్కిసలాట జరిగింది. జైలు నుండి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఖైదీలు తొక్కిసలాట, పోలీసుల కాల్పుల కారణంగా 129 మంది మరణించారు. ఆదివారం అర్థరాత్రి నాడు వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా, గార్డులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 24 మంది మరణించగా, 59 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో కొందరు దుండుగులైన ఖైదీలు మహిళా ఖైదీలపై అత్యాచారాలకు కూడా పాల్పడ్డారు. మరణించిన వారందరూ ఖైదీలేనా? పోలీసులు, గార్డులు కూడా ఉన్నారా? అనేది ఇంకా నిరూపణ కాలేదు. ఉదయం వరకూ కాల్పుల మోత వినిపిస్తోందని సాక్ష్యులు పేర్కొన్నారు. అయితే కేవలం 1500 మందికి చోటుండే ఈ కేంద్ర కారాగారంలో ఇప్పటికే 12 వేల మంది ఉంటున్నారని సమాచారం. వీరిలో ఎక్కువ మంది విచారణ ఖైదీలేనంటున్నారు.

