మా చెరువు కనిపించట్లేదు.. ప్లీజ్ కనిపెట్టండి !
మనకు ఎవరైనా కనిపించకపోయినా, ఏదైన కష్టం వచ్చినా, ఏదైన వస్తువులు పోయినా పోలీసులకు కంప్లైంట్ చేస్తాం. కానీ ఓ విచిత్రమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మా చెరువు కనిపించట్లేదని, చెరువు జాడ కనిపెట్టండి సారూ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తుక్కుగూడ గ్రామస్థులు.
అసలు విషయం ఏమిటంటే..
హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో 8 ఎకరాల్లో చెరువు ఉండాలని, కబ్జా చేసి వెంచర్లు వేశారని గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కబ్జాతో వర్షాకాలంలో పొలంలోని పంటలు మునుగుతున్నాయన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి తీవ్రంగా విసిగిపోయామని, పోలీసులైనా చెరువు ఆచూకీ వెతికిపెట్టాలని గ్రామస్థులు పహాడి షరీఫ్ పోలీసులను వేడుకుంటున్నారు.

మరోవైపు ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రాకి భారీ మద్దతు పెరుగుతోంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావాలని అధికార పార్టీ నేతలతోపాటు ఇతర పార్టీల నేతలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

