సినిమాలో ఫస్టాఫ్ మాత్రమే అయ్యింది…జగన్
వైసీపీ ఎమ్మెల్సీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం గడప గడపకూ చేసిన మంచి ప్రజల్లో ఉందని, అతి త్వరలోనే తిరిగి వేగంగా ప్రజల వద్దకు వెళ్లగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ సినిమాలో ఫస్టాఫ్ మాత్రమే అయ్యిందని, ఇంకా సెకండాఫ్ మిగిలే ఉందని వ్యాఖ్యానించారు. మాట తప్పకుండా రూ.2 లక్షల కోట్ల సహాయం క్రమం తప్పకుండా అందించాం. ప్రతీ పథకం ప్రతీ ఇంటికి డోర్ డెలివరీ చేశాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రావణకాష్టం చేస్తోందన్నారు. వారి పాపం ఊరికే పోదన్నారు. కేంద్రంలో కేవలం బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. చంద్రబాబు కేంద్రంలో కీలకంగా ఉండి కూడా ఇప్పటికీ ప్రత్యేక హోదా అడిగి సాధించలేకపోతే ఆయన పాపం చేసినట్లేనన్నారు. శిశుపాలుని పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు అతి త్వరలోనే ముగింపుకు వస్తాయన్నారు. ఇప్పుడు చట్టసభలలో శాసనమండలి సభ్యులే కీలక పాత్ర వహించాలని పేర్కొన్నారు. శాసన సభలో కావలసిన సీట్లు రాకపోవడం వల్ల వారు ప్రతిపక్ష హోదా కూడా ఇస్తారన్న నమ్మకం లేదన్నారు. తాను గతంలో 14 నెలలు పాదయాత్ర చేశానని, ఆ సత్తువ ఈ రోజుకీ తనకు ఉందన్నారు. ప్రజల్లోనే ఉంటామని, ప్రజల కష్టసుఖాలలో ఎప్పటికీ తోడుంటామని, ఇంటిటికీ తిరిగి సమస్యలు తెలుసుకుంటానని పేర్కొన్నారు జగన్.

