Home Page SliderNational

రాహుల్ చూపు యూపీ వైపు? రాయ్‌బరేలీ సీటు పోటీ వెనుక అసలు వ్యూహమేంటి!?

కాంగ్రెస్ ఇవాళ తీసుకున్న నిర్ణయం ఆసక్తిని కలిగిస్తోంది. అమేథీని తిరిగి గెలవాలని అంతా అనుకుంటున్న సమయంలో రాహుల్ గాంధీ ఆ సీటును కాదని… తల్లి సోనియా గాంధీ ఖాళీ చేసిన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడం సంచలనం కలిగించింది. ఐదేళ్ల క్రితం అమేథీలో బీజేపీ విజయం సాధించగా, గాంధీ కుటుంబం కంచుకోట అమేథీలో, ఆ కుటుంబానికి చిరకాల విధేయుడైన కిశోరీ లాల్ శర్మ ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా రాయ్‌బరేలీ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆమె వెనుకాడారు. ఒకవేళ ప్రియాంక పోటీ చేస్తే కుటుంబంపై విమర్శలొస్తాయన్న భావన ఉంది. అందుకే ఆమె పోటీకి వెనుకంజ వేసినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు.

ఐదో దశ ఎన్నికలకు మే 20న నామినేషన్ల దాఖలుకు ఇవాళ చివరి రోజు. వారంరోజుల ఉత్కంఠ అనంతరం శుక్రవారం కాంగ్రెస్ నిర్ణయం వెలువడింది. 2019లో అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ సీటు మారడం వెనుక కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక వ్యూహమున్నట్టుగా తెలుస్తోంది. అమేథీ నుంచి మరోసారి గెలిచితీరాతానంటున్నారు సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ. ఈ వారం ప్రారంభంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇది తమకు ఓడిపోయే సీటు అని నాయకత్వం తెలుసు, ఎందుకంటే వారు తమ విజయంపై అంత నమ్మకంతో ఉంటే, వారు ఈపాటికి తమ అభ్యర్థిని ప్రకటించి ఉండేవారు” అని స్మృతీ ఇరానీ అన్నారు. సోనియా గాంధీ ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు.

మొత్తంగా రాహుల్ గాంధీ పోటీ వెనుక దేశంలో, బీజేపీకి అనుకున్న విధంగా సీట్లు రాకుంటే.. ఎలాంటి పరిణామమైనా తమకు అనుకూలంగా మారుతుందేమోనని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో ఎస్పీ పార్టీతో జట్టుకట్టడంతో యూపీలో మెరుగైన సీట్లు వస్తాయన్న విశ్వాసంతో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికే వాయ్ నాడ్ ఎన్నిక పూర్తి కావడంతో, రాహుల్ సైతం ఇప్పుడు రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఇదే నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ గానీ, లేదంటే ఆమె భర్త రాబర్ట్ వాద్రాగానీ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. అయితే కుటుంబం మొత్తం ఎన్నికలో పోటీ చేస్తే, బీజేపీ ఇప్పటి వరకు విమర్శిస్తున్న వారసత్వ రాజకీయాల అంశం ఇబ్బందిపెడుతుందని హస్తం పార్టీ భావించింది. దీంతో రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.