హాట్ సీట్ మల్కాజ్‌గిరి… ఎందుకంత క్రేజ్!?
ఈ సీట్ ఇప్పుడు తెలంగాణలో హాట్ కేక్. నాక్కావాలి… నాక్కావాలంటూ నేతలు పోటీపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయండి బాబూ అంటూ వద్ద మహాప్రభో అన్న నేతలు సైతం ఇప్పుడు ఆ సీటు మాకంటే మాకు కావాలంటున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఉన్న సీటుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. వచ్చే ఎన్నికల్లో అక్కడ్నుంచి గెలిచి, సత్తా చాటాలని పలువురు నేతలు తెర వెనుక మంత్రాంగం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అక్కడ్నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన బీజేపీ డైనమిక్ లీడర్ ఈటల రాజేందర్.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీని స్ట్రెంథెన్ చేసే పనిలో పడ్డారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో కాషాయధ్వజాన్ని ఎగురేయాలని ఆయన సంకల్పించారు. ఇంతకీ ఆ సీటేంటనేగా మీ డౌట్.. యూ ఆర్ రైట్.. ఆ నియోజకవర్గం మరేదో కాదు మల్కాజ్‌గిరి.

మల్కాజ్‌గిరి నుంచి ఈటల పోటీ చేస్తున్నారంటూ వార్తలు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే పడింది. గత ఎన్నికల్లో పార్టీ ఆదేశానుసారం ఈటల వ్యవహరించారు. ఓవైపు అగ్రనేతలు ఎన్నికల్లో కొట్లాడేందుకు ముందు వెనుకా, ఆలోచిస్తే, ఈటల రాజేందర్ అటు కేసీఆర్‌పైనా, ఇటు సొంత నియోజకర్గం హుజూరాబాద్ బరిలోనూ దిగారు. ఫలితం దైవాదీనమన్న భావనతో ఆయన ఎన్నికల్లో కొట్లాడారు. అటు హుజూరాబాద్, ఇటు గజ్వేల్‌లోనూ భారీగా ఓట్లను రాబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార భేరి మోగించారు. కీలక నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేయడంతో ఆయనకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయ్. సాక్షాత్తూ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సైతం ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో తలవంచాల్సి వచ్చింది.

ఇప్పుడు ఈటల రాజేందర్ రాజకీయంగా సంధి దశలో ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భావిస్తున్నట్టుగా 10 స్థానాల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుంచి ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే పార్టీ ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటిస్తానంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఇప్పటి వరకు గెలవని మల్కాజ్‌గిరిని పార్టీకి కానుకగా అందిస్తానంటున్నారు ఈటల రాజేందర్.

మల్కాజ్‌గిరి బరిలో ఈటల నిలుచుండటంతో, ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మరికొందరు నేతలు సైతం ముందుకొస్తున్నారు. మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించాల్సిందిగా ఆయన పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఇక ఆయనతోపాటు గతంలో ఇక్కడ్నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా ఎన్ రామంచదర్ రావు, మరోసారి తనకు అవకాశం కల్పించాలంటున్నారు. ఇక బీజేపీ ముఖ్యనేతగా ఉన్న చాడా సురేష్ రెడ్డి సైతం మల్కాజ్‌గిరిలో తనకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీలో కొనసాగుతున్నానన్న ఆయన, టికెట్ ఇస్తే పార్టీని విజయతీరాలకు చేర్చుతానంటున్నారు. ఇక ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్స్ అధినేత కొమరయ్య సైతం టికెట్ ఆశిస్తున్నారు. ఇక కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన పన్నాల హరీశ్వర్ రెడ్డి సైతం తాను రేసులో ఉన్నానంటూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రచార హోరు పెంచారు.

బీజేపీలో ఎవరైనా సరే హైకమాండ్ ఆదేశాలు పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో ఈటల సైతం గెలుపు బావుటా ఎగురేసే వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో పార్టీ అవకాశమిస్తోందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి మల్కాజ్‌గిరి పరిధిలో నివాసముంటున్న ఈటల రాజేందర్, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాకు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సీటును కానుకగా ఇవ్వాలని ఆశిస్తున్నారు.

అందులో భాగంగా ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యాచరణను మొదలుపెట్టారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఆదరణ లభించడంలో కీలక పాత్ర పోషించిన ఈటల, ఇప్పుడు మల్కాజ్‌గిరిలోనూ కాషాయ జెండాను ఎగురేయాలని భావిస్తున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం 35 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. గత ఎన్నికల్లోనూ ఇక్కడ 50 శాతం వరకు మాత్రమే పోలింగ్ నమోదైంది. నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి ఇక్కడ్నుంచి సుమారుగా 11 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సీటు కోసం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ప్రయత్నిస్తుంటే, ఇక్కడ్నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మైనంపల్లి సైతం రేసులో నిలిచారు. ఇక మేడ్చల్ నుంచి గత ఎన్నికల్లో ఓటమిపాలైన వజ్రేష్ యాదవ్, అవకాశం కల్పిస్తే ఎన్నికల బరిలో దిగుతానంటున్నారు.

మరోవైపు బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఆశావహులు రేసులు ఉన్నారన్న అభిప్రాయం ఉన్నప్పటికీ ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు నేతలు వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే ఇక్కడ్నుంచి 2014లో ఎంపీగా విజయం సాధించిన చామకూర మల్లారెడ్డి మరోసారి పార్టీ అవకాశం కల్పిస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమంటున్నారు. మల్కాజ్‌గిరి నుంచి మంత్రి కేటీఆర్ బరిలో దిగాలని పార్టీలో ఒక వర్షన్ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. ఇప్పుడున్న సిచ్యువేషన్ నేపథ్యంలో ఆయన ఇక్కడ్నుంచి పోటీ చేయడం అనుమానమేనని చెప్పాలి. హాట్ సీట్ మల్కాజ్‌గిరి నుంచి ఈసారి ఎంత మంది ఎన్నికల బరిలో నిలుస్తారో.. చూడాలి.

