Home Page SliderNational

అయోధ్య – రామజన్మభూమి విశిష్టత

అయోధ్య ఒక పురాతన పట్టణం, హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. దీనిని ఔద్ లేదా అవధ్ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర భారతదేశంలోని దక్షిణ-మధ్య ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అయోధ్యను సాకేత్ అని పిలుస్తారు. రాముని పుట్టుక కారణంగా, తండ్రి దశరథుని పాలనతో ఇది ప్రసిద్ధి చెందింది. గొప్ప ఇతిహాసం రామాయణంతో అయోధ్య ముడిపడి ఉంది. ఆ చరిత్ర ఒకసారి తెలుసుకుందాం…

అయోధ్య పట్టణం సంపన్నమైనది. అధిక జనాభాతో విలసిల్లింది. సాంప్రదాయ చరిత్రలో, అయోధ్య కోసల రాజ్యానికి ప్రారంభ రాజధాని. కోసల్దేశ్ రాజధాని నగరాన్ని ఇక్ష్వాకు, పృథు, మాంధాత, హరిశ్చంద్ర, సాగర్, భగీరథుడు, రఘు, దిలీప, దశరథ్, రాముడు వంటి ప్రముఖ రాజులు పరిపాలించారు. 6వ, 5వ శతాబ్దంలో బౌద్ధుల కాలంలో ప్రధాన నగరంగా మారింది. అయోధ్య సాకేత పట్టణాన్ని పోలి ఉంటుందని… ఇక్కడ బుద్ధుడు నివసించాడని చెప్తారు. 11వ, 12వ శతాబ్దాల సమయంలో, కనౌజ్ రాజ్యం అయోధ్యలో ఉంది. ఆ తర్వాత దీనిని ఔధ్ లేదా అవధ్ అని పిలిచేవారు. తరువాత కాలంలో ఇది ఢిల్లీ సుల్తానుల ఆధీనంలో కొనసాగింది. ఆ తర్వాత జౌన్‌పూర్ రాజ్యం, 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది.

సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య నగరం పురాతన కాలం నాటి అవశేషాలతో గుర్తింపు పొందింది. దీనిని మొదట ఫైజాబాద్ అని పిలిచేవారు. రెండున్నర శతాబ్దాల క్రితం అవధ్ రెండో నవాబ్ సాదత్ ఖాన్ ఈ నగరానికి పునాది వేశారు. ఇది అయోధ్య పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. నవాబుల కాలం నుండి, సంప్రదాయాలు, వారసత్వాన్ని సజీవంగా ఉంచుతూ ఈ ప్రదేశం మోతీ మహల్, గులాబ్ బారీ, బహు బేగం సమాధి వంటి అనేక పర్యాటక కేంద్రాలతో విరాజిల్లుతోంది. సరయూ నదిపై పొడవైన ఘాట్‌లను 19వ శతాబ్దం మొదటి భాగంలో రాజా దర్శన్ సింగ్ నిర్మించారు. నది ఒడ్డున సీతా-రాముడు, నరసింగులకు అంకితం చేసి ఆలయాలు ఉన్నాయి.


హిందూ పురాణాల ప్రకారం, హిందూ ఇతిహాసం రామాయణంలో చెప్పినట్టుగా ఈ నగరాన్ని మనువు స్థాపించాడు. తరువాత, ఇది సూర్యవంశీయులకు రాజధానిగా మారింది. వీరిలో ముఖ్యుడు శ్రీరాముడు. అయోధ్య ప్రస్తావనలు అథర్వేదంలో కూడా ఉన్నాయి. అలాగే ఐదుగురు తీర్థంకరులు అయోధ్యలో జన్మించారని జైన సంప్రదాయాలు వివరిస్తాయి. అయోధ్య లేదా అవధ్‌పురి, శ్రీరాముని జన్మస్థలం, హిందువులకు ఏడు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలు లేదా మోక్షదాయిని సప్త్ పురిలలో ఒకటి. వివిధ ఉత్సవాలు, పండుగలు దీపోత్సవ్ అయోధ్య, రామ్ నవమి మేళా, శ్రావణ జల మేళా, రామ్ లీల, పరిక్రమాలు, అంతర్గ్రాహి పరిక్రమ, పంచకోశి పరిక్రమ, చతుర్దష్కోశి పరిక్రమ ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. రామ్‌కోట్, హనుమాన్ గర్హి, తులసి స్మారక్ భవన్, శ్రీ నాగేశ్వరనాథ్ ఆలయం, కనక్ భవన్, మణిపర్బత్, కొరియన్ పార్క్ మొదలైన ఆలయాలను అయోధ్యలో తప్పనిసరిగా సందర్శించాలి.