Home Page SliderTelangana

సంగారెడ్డిలో జగ్గారెడ్డికి లైన్ క్లియరవుతుందా?

తెలంగాణలో సమైక్యవాదిగా, తనదో ప్రత్యేక స్టైల్ అంటూ రాజకీయాలు చేసే తూర్పు జయ ప్రకాష్ రెడ్డి ఉరాఫ్ జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ పార్టీ వేవ్ ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఆయన సంగారెడ్డి నుంచి విజయం సాధించారు. చింతా ప్రభాకర్ పై స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన జగ్గారెడ్డి ఈసారి భారీ ఆధిక్యంతో గెలిచి, నాలుగోసారి ఎమ్మెల్యే కావాలని భావిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిన చింతా ప్రభాకర్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగ్గారెడ్డిని ఓడించి తీరుతానంటున్నారు. ఇక బీజేపీ నుంచి స్థానిక నాయకుడు రాజేశ్వర్ దేశ్ పాండేను కాదని పార్టీ పులిమామిడి రాజుకు అవకాశం ఇచ్చింది. పార్టీ విడుదల చేసిన లిస్టులు దేశ్ పాండే పేరు ఉన్నప్పటికీ.. బలమైన అభ్యర్థి అన్న భావనతో అభ్యర్థిని పార్టీ మార్చింది. అయితే సంగారెడ్డిలో వార్ వన్ సైడ్ అవుతుందా? ట్విస్ట్‌లు ఉంటాయా అన్నది చూడాల్సి ఉంది.

ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు 281. పురుష ఓటర్లు 1,18,265 మంది కాగా మహిళా ఓటర్లు 1,20,037 మంది ఉన్నారు. 34 మంది ట్రాన్స్ జెండర్లు ఓటు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్లు 2,38,336 ఉన్నారు. రాజకీయాలు ఎప్పుడూ చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆయా వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీలు సీట్లివ్వడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు అవసరాలు, సందర్భాలను బట్టి.. కాంపెన్సేషన్ బేసిస్‌లోనూ కొందరికి అవకాశాలు వస్తుంటాయ్. సంగారెడ్డిలో పద్మశాలీలు 3 శాతమే ఉన్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అదే సామాజికవర్గానికి చెందిన చింతా ప్రభాకర్‌కు అవకాశం ఇచ్చింది. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో ముదిరాజ్ ఓటర్లు 11 శాతం వరకు ఉండగా, ముస్లింలు 10 శాతానికి పైగా ఉన్నారు. మాదిగలు శాతం పదిన్నర శాతానికి చేరువగా ఉన్నారు. గొల్లలు 9 శాతానికి చేరువలో ఉన్నారు. మాలలు 8 శాతానికి దగ్గరగా ఉన్నారు. గౌడ సామాజికవర్గం ఇక్కడ 7 శాతానికిపైగా ఉండగా, రెడ్లు సైతం అంతే నిష్పత్తిలో ఉన్నారు. వైశ్యలు 4 శాతానికి పైబడి ఉన్నారు. లంబాడాలు 4 శాతానికి దగ్గరగా ఉండగా, మున్నూరు కాపులు సైతం మూడు శాతం ఉన్నారు. ఇతర సామాజికవర్గాలు అన్నీ కలిసి 23 శాతానికి పైగా ఉన్నారు.