Home Page SliderTelangana

ధర్మపురిలో కొప్పుల డౌటేనా!?

ధర్మపురి ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో వరుస విజయాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ చరిత్ర సృష్టించారు. గత ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంలో విజయం సాధించినప్పటికీ, ఆయన కుల సమీకరణాలతో కేసీఆర్ కేబినెట్‌లో చోటు సంపాదించుకున్నారు. మరోసారి విజయం సాధిస్తే అటు రాష్ట్ర రాజసీయాల్లోనూ, జిల్లా రాజకీయాల్లోనూ తనకు తిరుగుండదని భావిస్తున్న ఈశ్వర్‌కు ఈసారి నియోజకవర్గంలో సంపథీ దెబ్బ గట్టిగా పడేలా ఉంది. ఇప్పటికే నాలుగు సార్లు ఓడిపోయిన లక్ష్మణ్ కుమార్ ఈసారి విజయం సాధించాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. వరుసగా ఆరుసార్లు విజేతగా నిలిచిన కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దీమాతో ఉంటే.. ఇక్కడ్నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సైతం ఎస్ కుమార్ ఏ మేరకు ప్రభావితం చూపుతారో చూడాలి. ప్రధానంగా పోటీ ఈసారి బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం నేపథ్యంలో కొప్పులను ఓడించి ధర్మపురిలో లక్ష్మణ్ కుమార్ జెండా ఎగురేస్తారేలేదో చూడాలి.

ఇక ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు 269. పురుష ఓటర్లు 1,09,963, మహిళా ఓటర్లు 1,14,622, ట్రాన్స్ జెండర్లు ఆరుగురున్నారు. మొత్తం ఓటర్లు 2,24,591 ఉన్నారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇతర బీసీలు 21 శాతం వరకు ఉన్నారు. ఇక మున్నూరు కాపులు 14 శాతం, మాదిగలు పన్నెండున్నర శాతం మేర ఉన్నారు. మాలలు ఎనిమిదిన్నర శాతం, పద్మశాలీలు 7 శాతం, గొల్ల కురుమలు 6 శాతం, గౌడలు, రెడ్లు 5 శాతం మేర ఉన్నారు. తెనుగు, ముదిరాజ్‌లు సైతం 5 శాతం ఓటర్లున్నారు. ఇతరులు 9 శాతానికి పైగా ఉన్నారు.