Andhra PradeshHome Page Slider

చంద్రబాబు 650 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు

సీఎం జగన్‌ కటౌట్‌ చూసి సాధికార యాత్రకు వేలాదిగా ప్రజలు వస్తున్నారు – వైఎస్సార్‌సీపీ మంత్రులు
దెందులూరు బస్సు యాత్రకు భారీగా తరలి వచ్చిన బడుగు బలహీన వర్గాలు

సామాజిక సాధికార యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా స్పందన వస్తోందని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. సీఎం జగన్‌ కటౌట్‌ చూసి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజలు సమావేశాలకు వస్తున్నారని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. బస్సు యాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు దెందులూరు నియోజకవర్గం పరిధి సోమవరప్పాడు వద్ద ప్రారంభం కాగా.. సాయంత్రం గోపన్నపాలెంలో బహిరంగ సభలో నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ గతంలో వార్డు మెంబర్‌ కావాలంటే ఉన్నత వర్గాల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు సీఎం జగన్‌ నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసి వారికి ఉన్నత స్థానాల్లో సీఎం జగన్‌ కూర్చోబెట్టారని మంత్రి జోగి తెలిపారు. రాష్ట్రంలో 25 మంది మంత్రులు ఉంటే అందులో ఈ వర్గాలకు చెందిన 17 మంది ఉన్నారని ఆయన అన్నారు. భారతదేశం చరిత్ర పుటల్లో సీఎం జగన్‌ పేరు ఉంటుందన్నారు. మహాత్మా జ్యోతిరావ్‌ ఫులే ఆలోచనలు, అంబేద్కర్‌ రాజ్యాంగ స్పూర్తి, బాబు జగ్జీవన్‌రాం ఆశయాలు, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్‌ పోరాట పటిమ కలిగిన నాయకుడు సీఎం జగన్‌ అని మంత్రి జోగి పేర్కొన్నారు.

చంద్రబాబు చెప్పే మాటలను ఎవరూ నమ్మరు..
దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. అదే చంద్రబాబు 2014లో ఎన్నో వందల హామీలు ఇచ్చారు. అందులో ఏదీ నెరవేర్చలేదు. ముఖ్యంగా మహిళలకు డ్వాక్రా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ, పేదలకు మూడు సెంట్ల భూమి, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు చంద్రబాబు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేమీ నెరవేర్చలేదు. అదే సీఎం జగన్‌ మాత్రం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్‌. ఇక మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఏ విషయంలో అయినా తనకు పోటీ వస్తారా అని సవాలు విసిరారు. దెందులూరు గడ్డ ఎప్పటికీ వైసీపీ అడ్డాగా నిలుస్తుందని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలపారు. ఇవాళ దెందులూరు నియోజకవర్గంలో దాదాపు 11 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని పేర్కొన్నారు.

చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు.. – మంత్రి మేరుగు నాగార్జున

ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కానీ ఇవాళ బస్సు యాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. అణగారిన వర్గాలకు సుపరిపాలన అందించిన సీఎం జగన్‌ పాలనకు గుర్తుగా ఈ యాత్ర జరుగుతోందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. గతంలో చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలా అని, బీసీల తోకలు కత్తిరిస్తాం అని చెప్పి ఆయా వర్గాలను అణగదొక్కారన్నారు. కానీ నేడు జగనన్న ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంత మేలు చేశారో అందరికీ తెలుసని మంత్రి నాగార్జున స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన మోసాలు తెలియజేయడం కోసం ఈ యాత్ర చేపట్టామని, అదేవిధంగా సీఎం జగన్‌ మంచిని వివరించేందుకు యాత్ర సాగుతోందని ఆయన తెలిపారు. ఇక మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పేకాట రాయుడని, అవినీతి పరుడని, దళితులను అవమానించాడని ఆయన పేర్కొన్నారు.

పేదలందరూ సీఎం జగన్‌ వెంటే.. – మంత్రి విడదల రజిని

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎదగాలని ఇవాళ సామాజిక సాధికార యాత్ర చేస్తున్నట్లు మంత్రి విడదల రజిని తెలిపారు. ఏనాడైనా ఆయా వర్గాల బాగోగుల గురించి ఆలోచించిన నాయకుడు కానీ, పార్టీ కానీ ఉందా అని ఆమె ప్రశ్నించారు. కానీ నేడు రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలకు మంచి జరుగుతుందంటే దానికి కారణం సీఎం జగన్‌ అని మంత్రి రజిని పేర్కొన్నారు. ఆయా వర్గాల పార్టీ వైఎస్సార్‌ సీపీ అని మంత్రి రజిని తెలిపారు. ఇవాళ వైద్య, విద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన నాయకుడు సీఎం జగన్‌. అందుకే బడుగు, బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా మాకు జగన్‌ ఉన్నారు అని చెబుతున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇక గత కొన్నిరోజులుగా చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలు ఏవేవో యాత్రలు చేస్తున్నారు, సీఎం జగన్‌పై కక్ష కట్టారని మంత్రి పేర్కొన్నారు. పేదవర్గాలకు మంచి చేస్తున్న సీఎం జగన్‌పై టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి రజిని తెలిపారు. ఎవరు ఎన్ని చేసినా ప్రజల మద్దతు సీఎం జగన్‌కు ఉంటుందన్నారు.