పోలీస్ కాన్వాయ్‌పై కాల్పులు.. 11 మంది మృతి
మెక్సికోలో పోలీస్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది పోలీసులు మృతి చెందారు.
మెక్సికో సిటీ: పోలీస్ కాన్వాయ్‌పై దుండగులు దాడి చేయడంతో 11 మంది పోలీసులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం మెక్సికోలో గురెరో రాష్ట్రంలోని కోయుక డి బెనిటెజ్ నగరంలో జరిగింది. జాతీయ భద్రతా విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి ప్రయాణిస్తోన్న కాన్వాయ్‌పై దుండగులు కాల్పులతో రెచ్చిపోయారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పుల్లో అధికారి మృతి చెందాడా లేదా అనే విషయంపై పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదు.
మరో దాడిలో 5 మంది పౌరులు మృతి – మికావ్‌కన్ రాష్ట్రంలో టాకంబరో నగరంలో కొందరు దుండగులు నగర మేయర్ సోదరుడిని కాల్చేశారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి. వారిలో ఒకరు రెస్టారెంట్ ఉద్యోగి కాగా.. మరొకరు పోలీసు, మేయర్ సోదరుడు మాత్రం గాయాలతో తప్పించుకున్నాడు. మెక్సికోలో తరచూ ఇటువంటి సంఘటనలు జరగడం సాధారణమే. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం 2006 లో అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. అప్పటి నుండి దుండగుల దాడులు మరింత పెరిగాయి.

