Andhra PradeshHome Page Slider

వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఓటుకు నోటు కేసు తెర మీదకు రావడం మరింత చిక్కుల్లో పడినట్లు అయింది. ఉన్న కేసుల నుంచే బయటపడేందుకు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తుండగా అదే సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు ఈనెల 4వ తేదీన విచారణకు రానున్నది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు అక్టోబర్ 4వ తేదీ విచారణకు లిస్టులో చేర్చింది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును ఇప్పటికే సిఐడి అరెస్టు చేసింది. ఈ కేసుతోపాటు ఆయనను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మొదటి నిందితునిగా చేర్చింది. దీంతోపాటు ఫైబర్ నెట్ స్కామ్ కేసులోనూ 25వ నిందితునిగా పేర్కొంది. ఇప్పటికే స్కిల్ కేసులో అరెస్ట్ లో ఉన్న ఆయనను ఫైబర్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్టు చేసేందుకు అనుమతి కోరుతూ సిఐడి విజయవాడ ఏసిబి కోర్టులో పిటి వారెంట్ పిటిషన్లు దాఖలు చేసింది. మరోవైపు స్కిల్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు ఇదే ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ మూడు పిటిషన్లు అక్టోబర్ 4వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు రానున్నాయి.

అయితే ఫైబర్ నెట్ కేసుతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు తరఫున హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో లోకేష్ ను 14 నిందితునిగా చేర్చిన సిఐడి శనివారమే ఆయనకు సిఆర్పీసీ 41ఏ నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 4వ తేదీనే లోకేష్ సిఐడి ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇలా వరుస కేసులతో ఉక్కిరిబిక్కి రవుతున్న చంద్రబాబు నాయుడుకు ఓటుకు నోటు కేసు కూడా విచారణకు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.