వైసీపీ సరికొత్త కార్యక్రమం పల్లెకు పోదాం చలోచలో…
- పల్లెకు పోదాం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో బస
- ప్రతి సచివాలయ పరిధిలో ఒకరోజు కేటాయింపు
- మండల అధ్యక్షుడు రాత్రికి అక్కడే బస
- అసెంబ్లీ సమావేశాలయ్యాక కార్యక్రమం ప్రారంభం
- నేతల మధ్య అంతరాలు తొలగించేలా ఏర్పాటు
ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీ నెల చివరిలో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. పల్లెకు పోదాం అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన అంశాలపై పార్టీలోని సీనియర్ నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గడిచిన నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ఉండాలన్న దానిపై చర్చలు నడిచాయి. తాజాగా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు. గ్రామ పట్టణ స్థాయిలో మరింత బలం పెంచుకునేందుకు వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలోనే పల్లెకు పోదాం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి విధివిధానాలను రూపొందించారు.

త్వరలోనే దీనిపై రీజనల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు చెప్పే అంశాల ఆధారంగా కూడా ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగులు దిద్ది ప్రజల ఆధరాభిమానాలు చూరగోనాలన్న లక్ష్యంతో అధికార వైఎస్ఆర్సీపీ వేగంగా అడుగులు వేస్తోంది. పార్టీ పెద్దలు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం మండల అధ్యక్షుడు ప్రతిరోజు తన మండల పరిధిలోని ఒక సచివాలయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ సచివాలయానికి ఉదయాన్నే వెళ్లి అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించాల్సి ఉంటుంది.

అనంతరం ఆ సచివాలయ పరిధిలో లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత సదరు లబ్ధిదారులతో నేరుగా మమేకమవుతారు. మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం మళ్లీ లబ్ధిదారులతో మాటామంతి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సాయంత్రం పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. మండల అధ్యక్షుడు నేతృత్వంలో గ్రామంలోని పార్టీ ముఖ్య నేతలు భేటీ అవుతారు. రాత్రి నేతలు అంతా కలిసి భోజనం చేయనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో లేదా వార్డులో నేతల మధ్య నేలకొన్న అంతరాలను తొలగించడం పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఈ క్రమంలోనే దీనితో పాటు కొత్తవారిని చేర్చుకునే అంశంపై చర్చిస్తారు.ఎన్నికల ఏడాది కావడంతో పల్లెకు పోదాం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జగన్ ఇప్పటికే పార్టీ ముఖ్యులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించాలని పార్టీ బాధ్యులు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా ఉండాల్సిన మండల అధ్యక్షుల ఎంపికను పూర్తి చేశారు. త్వరలోనే రీజనల్ కోఆర్డినేటర్లతో ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఆ సమావేశం అనంతరం దీనికి మరిన్ని మెరుగులు దిద్ది వినూత్న తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి.

