ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయి గుర్తింపు
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటిలోకి పార్టీ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని హస్తం పెద్దలు ఎంపిక చేశారు. ఇకపై దేశ వ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులను కమిటీ నిర్ణయిస్తుంది. తెలంగాణతో సహా ఐదు తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికను సైతం ఈ కమిటీయే పరిశీలించనుంది. 16 మంది సభ్యుల కమిటీలో తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమా రెడ్డిని ఎంపిక చేశారు. ఈ కమిటీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోని, అధిర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షిద్, మధుసూధన్ మిస్త్రీ, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మహ్మద్ జావెద్, అమీ యాజ్నిక్, పీఎల్ పునియా, ఓంకార్ మర్కమ్, కేసీ వేణుగోపాల్ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఉత్తమ్ మొదట్నుంచి నమ్మినబంటులా ఉంటూ పార్టీ ఆదేశాలను శిరసావహిస్తున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో ఆయన మేరునగ శిఖరం. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూక్తి ఆయన రాజకీయ జీవితం చూస్తే అవగతమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన పోషించిన పాత్ర అసమానం. ఉద్యమ సమయంలో పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరిగి… తెలంగాణ ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు. తెలంగాణ జనం పట్ల సానుకూల దృక్పథాన్ని ఢిల్లీ ప్రజలకు కలగడంలో అద్వితీయపాత్ర పోషించారు. ఆయనెవరో కాదు నల్గొండ జిల్లా ముద్దు బిడ్డ నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి. జూన్ 20, 1962 నల్గొండ జిల్లాలో… పురుషోత్తం రెడ్డి, ఉషా దేవి దంపతులకు జన్మించారు. బీఎస్సీ చదువుకున్న ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. మిగ్ 21, మిగ్ 23 ఫైటర్ జెట్లను నడిపి అభిమానులతో కెప్టెన్ అని పిలిపించుకున్నారు. రాష్ట్రపతి భవన్లోను కీలక బాధ్యతల్లో ఆయన పనిచేశారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రముఖలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ప్రజా సేవకు అంకితమవ్వాలన్న ఉత్తమ్ ఆలోచనకు పార్టీ నుంచి సానుకూల స్పందన లభించింది. తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు సుస్థిర స్థానం కలిగించింది.

ఐదు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004లో కోదాడ నుంచి రెండు సార్లు విజయం సాధించారు. 2009లో తొలిసారి హుజూర్ నగర్ నుంచి బరిలోకి దిగారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి విజయం సాధించారు. ఐతే పార్టీ ఆదేశాల మేరకు 2019 లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా విజయదుంధుభి మోగించారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన హుజూర్నగర్ ఎమ్మెల్యేకు రాజీనామా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గృహ నిర్మాణం, బలహీన వర్గాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీకి ఆయన తెలంగాణ పక్షాన నేతృత్వం వహించారు. అప్పటి హోం మంత్రి చిదంబరంతో తెలంగాణ ఆవశ్యకతను వివరించి, తెలంగాణ ప్రకటనకు కారణమయ్యారు.

కేసీఆర్ తెలంగాణను పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వలసలకు ప్రేరేపిస్తున్న తరుణంలో పీసీసీ చీఫ్‌గా ఆయన పోషించిన పాత్ర అనన్యసామాన్యం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక, తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మార్చి 2017 నుంచి జూన్ 2021 వరకు బాధ్యతలు చేపట్టారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి సైతం రాజకీయంగా క్రీయశీల పాత్ర పోషిస్తున్నారు. ఆమె కోదాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బరిలో దిగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఇద్దరూ కూడా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి భారీ మెజారిటీతో గెలిపిస్తామంటూ కార్యకర్తలు జంగ్ సైరన్ మోగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దంపతులివురూ రెండు నియోజకవర్గాల నుంచి, భారీ ఆధిక్యంతో గెలుస్తారని సర్వేలు ఘోషిస్తున్నాయి.

