పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాయే లక్ష్యమన్న సీఎం వైఎస్ జగన్
18,883 లబ్ధిదారుల ఖాతాల్లో రూ.141.60 కోట్లను జమ చేసిన సీఎం జగన్
సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలా ఎన్నికల కోసం కాదు.. ప్రజల కోసం
గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య ఈ తేడాను ప్రజలు గమనించండి
2023 ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా నిధులను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేడు ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ త్రైమాసికంలో అర్హులైన 18,883 జంటలకు గానూ రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి వధువుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.

పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాయే లక్ష్యంగా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’ ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు ‘వైఎస్సార్ షాదీ తోఫా’ ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా నేడు విడుదల చేస్తున్న సాయంతో కలిపి గడిచిన 9 నెలల్లోనే వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా కింద 35,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 267.20 కోట్లు ప్రభుత్వం జమ చేశామని పేర్కొన్నారు. “ఏటా నాలుగు విడతల్లో నిధులు పంపిణీ చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏదీ చిత్తుశుద్ధితో చేయలేదన్నారు. గతంలో ఎన్నికలే లక్ష్యంగా పథకాలు అమలు చేశారు. వధూవరులిద్దరికీ టెన్త్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశాం, తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను కచ్చితంగా చదివిస్తారు. పేదరికం నుంచి బయటపడే ఆయుధం చదువు ఒక్కటే” అని సీఎం స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం హయాంలో 17,709 మందికి రూ.68.68 కోట్లు ఎగ్గొట్టిన ఘనత వారిదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. కానీ, మన ప్రభుత్వ హయాంలో పేదరీకాన్ని పరద్రోలేందుకు చదువు ప్రోత్సాహించే విధంగా పథకాలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ప్రతి మహిళ డిగ్రీ చదువుకోవాలని వారు చదువుకుంటేనే వారి పిల్లలకు కూడా చదువు అందిస్తారని సీఎం ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా మన ప్రభుత్వం అందిస్తున్న విద్యా దీవేన, ఫీజ్ రియాంబర్స్మెంట్ ద్వారా చదువులు పూర్తి చేసుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నవారు 86 శాతం మంది ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. అందరికి సంక్షేమ పథకాలు అందాలన్ని మన ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు.

