Home Page SliderNational

తండ్రి కొడుకులను కలిపిన అన్నదానం

ఒక అన్నదానం కారణంగా కొన్నేళ్ల క్రితం వేరుపడిన తండ్రి కొడుకులు కలుసుకున్నారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రం లోని రామ్‌గడ్ పట్టణంలో జరిగింది. రామ్‌గఢ్‌లోని ఓంకార్ మిషన్ స్థానిక అనాధాశ్రమంలో శుక్రవారం పేదలకు అన్నదానం ఏర్పాటు చేసింది. ఆ ఆశ్రమంలో ఉన్నశివం అనే 8 వ తరగతి విద్యార్థి వారికి వడ్డన చేస్తూండగా, ఒక వ్యక్తిని చూసి, నివ్వెరపోయాడు. ఆయన తన తండ్రి టింకువర్మ అని గుర్తించాడు. టింకువర్మ కూడా శివంను చూసి, గుర్తించాడు. దీనితో వారిద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు. రక్త సంబంధం ఎక్కడెక్కడి వారినో కలుపుతుంది. పదేశ్ల క్రిందట  శివం మూడేళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు అతని తల్లి అనుమానాస్పద రీతిలో మరణించింది. దీనితో టింకువర్మను అరెస్టు చేశారు పోలీసులు. శివం సంరక్షణ బాధ్యతను అనాధాశ్రమానికి అప్పగించారు. దాదాపు పదేళ్ల అనంతరం జైలు నుండి విడుదలై ఆటో రిక్షా నడుపుకుంటున్నారు టింకువర్మ. అనాధాశ్రమం వారు ఏర్పాటు చేసిన అన్నదానం వల్ల తండ్రి కొడుకులిద్దరూ కలుసుకున్నారు. అధికారిక లాంఛనాలు పూర్తయిన అనంతరం శివం ను తండ్రికి అప్పగిస్తారు. తాను ఈ జన్మలో తండ్రిని కలుసుకుంటాననుకోలేదని చాలా సంబరపడ్డాడు శివం.