జమ్మూలో భద్రతా బలగాలపై తీవ్రవాదుల కాల్పుల్లో 5గురు జవాన్లు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు మరణించారు. మరొకరు గాయపడ్డారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆర్మీ ప్రారంభించిన సైనిక ఆపరేషన్‌లో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ముష్కరులను మట్టుబెట్టడానికి సైన్యం ఆపరేషన్ ప్రారంభించిందని రక్షణ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు భారీ పేలుడు పదార్థాలతో దాడికి తెగబడటంతో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మరణించగా, గాయపడినవారిలో మరో ముగ్గురు జవాన్లు ఉధంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

రాజౌరి జిల్లాలోని కంది ప్రాంతంలోని కేస్రీ హిల్ వద్ద ఈ ఆపరేషన్ జరిగింది. ఓ గుహలో ఉగ్రవాదులు గుంపులు గుంపులుగా ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందిందని సైన్యం తెలిపింది. పూంచ్ జిల్లాలోని భాటా ధురియన్ వద్ద ఏప్రిల్ 20న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదుల బృందం మెరుపుదాడిలో పాల్గొంది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మరణించగా, ఉగ్రవాదులు సైనికుల ఆయుధాలతో పారిపోయారు. “జమ్మూ ప్రాంతంలోని భాటా ధురియన్‌లోని టోటా గలి ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై ఆకస్మిక దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సమూహాన్ని బయటకు తీయడానికి ఇండియన్ ఆర్మీ నిఘా ఆధారంగా రక్షణ చర్యలు చేపడుతున్నట్టు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి సమీపంలోని అదనపు బలగాలను రప్పించినట్టు చెప్పారు.
2021 అక్టోబర్‌లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనికులు మరణించిన తర్వాత ఈ సంఘటన పునరావృతమైంది. నాడు జరిగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో మరో నలుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. నెల రోజుల పాటు ఆపరేషన్ చేసినా ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టలేకపోయింది. గత నెలలో జరిగిన భాటా దురియన్ దాడి తరువాత, తీవ్రవాదులను గుర్తించలేకపోవడంతో భారీగా కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకొంది.

