Home Page SliderNational

విడాకులను ప్రత్యేకమైన ఫోటోషూట్‌తో వేడుకగా జరుపుకున్న మహిళ

భారతీయ సమాజంలో విడాకులు అంటే ఎవరూ ఇష్టపడరు. దాన్నో నిషేధమైన విషయంగా భావిస్తారు. దీర్ఘకాలం కలిసి మెలసి ఉన్న జంటలు, విడిపోవడమంటే దాన్నో విషాధ ఘట్టమనుకుంటారు. విడాకులు పేరు వింటేనే అవమానకరమని అనుకుంటారు. మానసిక ఒత్తిడికి లోనవుతారు. దాని గురించి ఎక్కువగా మాట్లాడటానికి అసలు ఇష్టపడరు. అయితే, ఒక మహిళ తన విడాకులను జరుపుకోవడానికి ప్రత్యేకమైన ఫోటోషూట్‌తో ముందుకు వచ్చింది. మూస పద్ధతులను బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. కళాకారిణి, ఫ్యాషన్ డిజైనర్ షాలిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వరుస చిత్రాల షేర్ చేసింది. ఎరుపు రంగు దుస్తులు ధరించి, ”డివోర్స్” అనే అక్షరాలను పట్టుకుని కనిపించింది.

”విడాకులు తీసుకున్న మహిళ గొంతులేని వారికి సందేశం. చెడ్డ వివాహాన్ని విడిచిపెట్టడం సరైందే, ఎందుకంటే, సంతోషంగా ఉండటానికి మనుషులు అర్హులు. ఎవరైనా జీవితాలను నియంత్రించుకోవాలని అనుకోవద్దు. మీకు, మీ పిల్లలకు మంచి భవిష్యత్తును సృష్టించడానికి అవసరమైన మార్పులను చేసుకోండి. విడాకులు వైఫల్యం కాదు! ఇది మీకు ఒక మలుపు, మీ జీవితంలో సానుకూల మార్పులకు దారి తీస్తుంది. వివాహాన్ని విడిచిపెట్టి ఒంటరిగా ఉండాలంటే చాలా ధైర్యం కావాలి, కాబట్టి అక్కడ ఉన్న నా ధైర్యవంతులైన మహిళలందరికీ నేను దీన్ని అంకితం చేస్తున్నాను,” అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. మరో ఫోటోలో ఆమె తన భర్తతో ఉన్న ఫోటనూ చించివేస్తూ కన్పించింది. ”నాకు 99 సమస్యలు ఉన్నాయి, కానీ భర్త అందులో ఒకటి కాదు” అని సైన్ బోర్డుతో ఆమె పోజులిచ్చింది.

సోషల్ మీడియా ద్వారా విడాకులను వేడుకగా జరుపుకోవడంపై చాలా మంది వ్యక్తులు స్పందించారు. ధైర్యమైన నిర్ణయంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు. ”మీరు ఒక బలమైన మహిళ.” అంటూ ఒకరు వ్యాఖ్యానిస్తే… ”సూపర్ పవర్ ఉన్న ధైర్యవంతులైన మహిళలు రాకింగ్ చేస్తూనే ఉంటారు. మేము మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటాం. నెగెటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోకండి, మీరు మీ జీవితమంతా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఇక్కడ ఎవరికీ తెలియదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

అయితే, ఆమెను ట్రోల్ చేసి విమర్శించే వారు కూడా ఉన్నారు. ”ప్లీజ్ చాలా మంది విడాకులు తీసుకుంటారు. ఫోటోషూట్ తీసుకుంటారు, ఇది సమాజానికి మంచిది కాదు, విడాకుల షూట్ ఫోటోలన్నింటినీ తొలగించండి.” అని అభిప్రాయాన్ని షేర్ చేయగా, మరో వ్యక్తి “మన సమాజంలో ఏమి జరుగుతుందో దేవునికి తెలుసు. ప్రాథమికంగా కొన్ని రోజుల క్రితం అదే పని చేసిన పాశ్చాత్య అమ్మాయిని కాపీ కొట్టింది. ఫుటేజీల కోసం ఆమె మన దేశంలో పవిత్రంగా భావించే వివాహాన్ని కళంకం చేసింది. అని విమర్శించాడు.