Home Page SliderNational

కర్నాటకలో ఉమ్మడి పౌరస్మృతి, బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో

కర్నాటకలో హోరాహోరీగా ఎన్నికల సంగ్రామం
కర్ణాటకలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు
వాగ్దానాలు సమాజంలోని ప్రతి వర్గాన్ని తాకేలా హామీలు
ఏటా పేదలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు

కర్నాటక ఎన్నికల్లో బీజేపీ కొత్త పాచిక విసురుతోంది. బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే, యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) అమలు చేస్తామని ప్రకటించింది. తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని పేర్కొంది. మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ కీలక వాగ్దానాలను ప్రకటించింది. బీజేపీ ప్రజా ప్రణాళిక పేరుతో రూపొందించిన మేనిఫోస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు బెంగళూరులో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై, సీనియర్ పార్టీ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మేనిఫెస్టోను ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లో చర్చించి తయారు చేయలేదని, పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని ప్రతి మూలను సందర్శించి ఈ పత్రాన్ని సిద్ధం చేశామన్నారు.

అందరికీ న్యాయం, ఎవరి మొప్పూ అక్కర్లేదు అన్న సూత్రం ఆధారంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామన్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. కర్నాటకలో బీజేపీ సర్కారు ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను రద్దు చేసిందన్నారు. ఎన్నికల ప్రకటనకు ముందు, బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని మంత్రి వర్గం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌లను రద్దు చేసి, కర్నాటకలో రాజకీయంగా కీలకమైన లింగాయత్‌లు, వక్కలిగలకు సమానంగా విభజించాలని నిర్ణయించింది. ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చాయి.

రాష్ట్రంలో ఈసారి గట్టి ఎన్నికల పోరును ఎదుర్కొంటున్న బీజేపీ, సమాజంలోని ప్రతి వర్గాన్ని చేరుకోవాలని వాగ్దానాలు ఇచ్చింది. రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వస్తుందని, “అత్యున్నత స్థాయి కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా” ఏర్పాటు చేయబడుతుందని పార్టీ పేర్కొంది. జాతీయ పౌరుల రిజిస్టర్‌ను ప్రవేశపెడతామని, “అక్రమ వలసదారులందరినీ త్వరితగతిన బహిష్కరిస్తామని” హామీ ఇచ్చింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలవారీ రేషన్ కిట్‌లు, షెడ్యూల్డ్ కులాలు, తెగల మహిళలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం, కర్నాటకను ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా అభివృద్ధి చేసే ప్రణాళిక వంటి ఇతర వాగ్దానాలు ఉన్నాయి. ఒక సంవత్సరంలో BPL కుటుంబాలకు 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను కూడా పార్టీ హామీ ఇచ్చింది. ఉగాది, గణేష్ చతుర్థి, దీపావళి నెలల్లో ఒక్కో సిలిండర్ ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది.

కర్నాటకలో ఈసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఇంకా మేనిఫెస్టో విడుదల చేయలేదు. ప్రచార సమయంలో, ప్రతిపక్ష పార్టీ అన్ని ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, బీపీఎల్ కుటుంబాలకు 10 కిలోల బియ్యం, ప్రతి కుటుంబంలోని మహిళ తలకు ₹ 2,000 నెలవారీ సహాయం, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు ₹ 3,000 భృతిని హామీ ఇచ్చింది. త్రిముఖ ఎన్నికల పోరులో మరో పార్టీ అయిన జనతాదళ్ (సెక్యులర్) కన్నడిగులకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టానికి హామీ ఇచ్చింది. సివిల్ సర్వీసెస్, డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలను కన్నడలో కూడా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని కూడా తెలిపింది.

బెంగుళూరులోని అపార్ట్‌మెంట్ నివాసితులకు సంప్రదింపుల కమిటీ ద్వారా సౌలభ్యమైన జీవన విధానాన్ని మెరుగుపరుస్తామని బీజేపీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల మధ్య సహకారాన్ని నడపడానికి ఒక చొరవను ప్రారంభించనున్నట్లు తెలిపింది. పాఠశాల స్థాయిలో, ప్రభుత్వ పాఠశాలల అప్‌గ్రేడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ వ్యక్తులు, సంస్థలతో జట్టుకడతామని బీజేపీ హామీ ఇచ్చింది. ప్రతి మునిసిపల్ వార్డులో రోగనిర్ధారణ సౌకర్యాలతో కూడిన క్లినిక్‌ని ఏర్పాటు చేయడం ద్వారా పబ్లిక్ హెల్త్‌కేర్ మౌలిక సదుపాయాలను పెంచుతామని, సీనియర్ సిటిజన్‌లకు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలను కూడా మేనిఫెస్టో హామీ ఇచ్చింది.

రైతుల కోసం, ప్రతి గ్రామ పంచాయతీలో మైక్రో కోల్డ్ స్టోరేజీలు, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ ఉత్పత్తుల కమిటీల ఆధునీకరణ కోసం ₹ 30,000 కోట్ల నిధులను పార్టీ హామీ ఇచ్చింది. కర్నాటకను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అనేక సర్క్యూట్‌లు, కారిడార్‌లను అభివృద్ధి చేయడానికి ₹ 1,500 కోట్ల ప్రణాళికను మేనిఫెస్టో వాగ్దానం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని పేదలకు 10 లక్షల ఇళ్ల స్థలాలను ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.