Home Page SliderNews AlertTelangana

కేబుల్‌ బ్రిడ్జి ముహూర్తం ఖరారు..

కరీంనగర్‌ నగరంలో మరో మణిహారంగా నిలిచే కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 14న వంతెన ప్రారంభించాలని తెలంగాణ సర్కార్‌ ముహూర్తం ఖరారు చేసింది. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా వంతెనను ప్రారంభిస్తారని తెలుస్తోంది. వరంగల్‌ – కరీంనగర్‌ నగరాల మధ్య దాదాపు 7 కిలో మీటర్ల దూరం తగ్గించడం, హైదరాబాద్‌ – కరీంనగర్‌ రహదారి మీద ట్రాఫిక్‌ జామ్‌ బెడద నుండి ప్రజలకు ఉపశమనం లభించనుంది. 2018లో రూ. 180 కోట్ల బడ్జెట్‌తో వంతెన పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న కేబుల్‌ బ్రిడ్జి ఇదే కావడం విశేషం. పూర్తిగా విదేశీ ఇంజినీరింగ్‌ సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి నాణ్యతను ఇప్పటికే పలుమార్లు ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించారు. వచ్చే నెల 14న ప్రారంభ తేదీ ఖరారు కావడంతో ఇప్పటికే 8 కోట్లతో ఏర్పాటు చేస్తున్న డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఏప్రిల్‌ 14న ప్రారంభించిన అనంతరం వాహనాలను వంతెన మీదికి అనుమతిస్తారు. అయితే ప్రతి ఆదివారం మాత్రం వాహనాలను అనుమతించరు. వంతెనపై ఏర్పాటు చేసిన డైనమిక్‌ లైటింగ్‌ను ఆస్వాదించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బ్రిడ్జిను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులకు ఫుడ్‌, వినోదాత్మక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మ్యూజిక్‌, కొరియా సాంకేతికతతో డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌, నాలుగు భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.