Andhra PradeshHome Page Slider

వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల కుమ్ములాట

ఏపీ అసెంబ్లీలో ఇవాళ టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు తన్నుకున్నారు. వైసీపీ అసభ్యంగా ప్రవర్తించిందని టీడీపీ విమర్శిస్తే.. టీడీపీ నేతలే దారుణానికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది. స్పీకర్ పట్ల టీడీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారని వైసీపీ ధ్వజమెత్తింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ జీవో నెంబర్ 1ని రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనికి స్పీకర్ అంగీకరించలేదు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్ద దూసుకొచ్చారు. తప్పు చేస్తే స్పీకర్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి గానీ… వైసీపీ ఎమ్మెల్యేలు గుండాల్లా దాడులు చేయడమేంటని ప్రశ్నించారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. 75 ఏళ్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి దాడి చేయడం దారుణమన్నారు. ఐతే అందుకు వైసీపీ కౌంటర్ వర్షన్ విన్పిస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లినే, బుచ్చయ్య చౌదరి నెట్టేశారని.. దీంతో ఆయన కిందపడిపోబోయారంది. మరోవైపు ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడి చేశారని టీడీపీ నేతలు చెబుతుంటే.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామినే ఎమ్మెల్యే బాలవీరాంజనేయులు దూషించారంటూ ఆ పార్టీ వర్షన్ విన్పించారు. అసలు పోడియం వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలకు ఏం పనంటూ టీడీపీ ప్రశ్నిస్తే.. స్పీకర్‌కు రక్షణ కల్పించడానికే వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారని.. ఆ పార్టీ వర్షన్ ఎమ్మెల్యేలు విన్పించారు. అసెంబ్లీ చరిత్రలో ఇదో చీకటి రోజని టీడీపీ, వైసీపీ నేతలు ఇద్దరూ పరస్పరం విమర్శలు చేసుకోవడం కొసమెరపు. మూడు సీట్లు గెలిచి, అధికారంలోకి వచ్చామన్న బిల్డప్ టీడీపీ నేతలిస్తున్నారంటూ మంత్రి అంబడి మండిపడితే… ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ ఇలా చేస్తోందని విమర్శించారు టీడీపీ నేత కె అచ్చెన్నాయుడు.