Home Page SliderNational

జలంధర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా కరమ్‌జిత్ కౌర్ చౌదరి

జలంధర్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్
దివంగత కాంగ్రెస్ ఎంపీ భార్యకు టికెట్
కరమ్‌జిత్ కౌర్ చౌదరి అభ్యర్థిత్వానికి ఆమోదం
జలంధర్‌లో సానుభూతి వర్కౌటవుతుందా?
సెంటిమెంట్ పండించేలా హస్తం వ్యూహాలు

జలంథర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకపోయినా… అక్కడ్నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు హస్తం పార్టీ ఇప్పట్నుంచి వ్యూహాలు రచిస్తోంది. దివంగత ఎంపీ సంతోష్ సింగ్ చౌదరి, భార్యను జలంధర్ ఉపఎన్నిక నుంచి బరిలో దించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కరమ్‌జిత్ కౌర్ అభ్యర్థిత్వాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారు. కరమ్‌జిత్ మూడు దశాబ్దాలకు పైగా ఉన్నత విద్యా శాఖలో ప్రొఫెసర్‌గా పనిచేసి పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. జనవరి 14న భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి (76) గుండెపోటుతో మరణించడంతో నియోజకవర్గం ఖాళీ అయింది.

కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలిచినందుకు కాంగ్రెస్‌ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కరమ్‌జిత్ చౌదరి తెలిపారు. దివంగత భర్త కలలు, ఆకాంక్షలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు. కమల్‌జిత్ కౌర్ చౌదరి విజయం కోసం తామంతా కష్టపడి పనిచేస్తామని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ట్వీట్ చేశారు. అభ్యర్థిత్వాన్ని ప్రకటించకముందే, కరమ్‌జిత్ చౌదరి తన కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్‌జిత్ సింగ్ చౌదరితో కలిసి రెండు వారాల నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తల్లీ కొడుకులిద్దరూ వేర్వేరు గ్రామాలలో సమావేశాల నిర్వహిస్తూ, ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సానుభూతి అస్త్రాన్ని సైతం వారు ప్రయోగిస్తున్నారు. దివంగత భర్త ప్రజల కోసమే జీవించారని, తమ కుటుంబం జలంధర్ ప్రజల సేవకు అంకితమని కరమ్‌జిత్ చౌదరి అంటున్నారు.

2019లో చౌదరికి 3,85,712 ఓట్లు రాగా, SAD అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ అత్వాల్‌కి 3,66,221, బీఎస్పీ అభ్యర్థి బల్వీందర్ సింగ్‌కు 2,04,783 ఓట్లు లభించాయి. ఆప్ అభ్యర్థి జస్టిస్ జోరా సింగ్ (రిటైర్డ్)కు కేవలం 25,467 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఈ ఎన్నికకు ఆప్‌కు సైతం ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఈసారి జలంధర్ నుంచి గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్, మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్‌తో మాజీ మంత్రులు, పలువురు సీనియర్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని నేతలు స్పష్టం చేస్తున్నారు.