చిన్నారి ప్రాణం కోసం పదకొండు కోట్లు దానం చేసిన కలియుగ కర్ణుడు
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 16 నెలల వయస్సున్న చిన్నారి బాధ విదేశాలలోని ఓ వ్యక్తిని కదిలించింది. పేరు కూడా చెప్పకుండా ఏకంగా 11 కోట్ల రూపాయలు దానం చేశాడు. కేరళలోని ఎర్నాకులానికి చెందిన నౌకాదళ అధికారి సారంగ్, అతిథి దంపతుల చిన్నారి నిర్వాణ్(16 నెలలు). నిర్వాణ్ 16 నెలల వయస్సు వచ్చినా కాళ్లు కదపలేక పోతున్నాడు. ఈ చిన్నారికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-2 అనే వ్యాధి ఉందని వైద్యులు తెలిపారు. దీనికి చికిత్స కోసం రెండేళ్లు నిండకుండానే చాలా మందులు వాడాలని, వీటిని అమెరికా నుండి తెప్పించాలని వాటికి ఏకంగా 17.5 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇంత ఆర్థిక స్థోమత లేని ఈ కుటుంబం సహాయం కోసం సోషల్ మీడియాలో అర్థించగా, బాబు ఖాతాలోకి విరాళాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పేరు కూడా చెప్పకుండా విదేశాల నుండి 11 కోట్ల రూపాయలు జమ చేయబడ్డాయి. దీనితో వీరి కష్టాలు కొలిక్కి వచ్చాయి. నిర్వాణ్ చికిత్స మొదలయ్యింది. మరొక 80 లక్షలు వస్తే మొత్తం సమకూరినట్లేనని సంబరపడుతున్నారు బాబు తల్లిదండ్రులు.

