Andhra PradeshHome Page Slider

మండలిలో బలీయ శక్తిగా వైసీపీ

• కేవలం నాలుగు స్థానాలకే పరిమితం కానున్న తెలుగుదేశం పార్టీ
• 23 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు జగన్ వ్యూహాలు
• ఎమ్మెల్సీ స్థానాలు భర్తీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ

ఏపీలో టార్గెట్ 175 కింద 2024 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి లో ప్రభలమైన శక్తిగా ఎదగబోతుంది.ఈ సంవత్సరం మార్చి 29 నాటికి 14 ఎమ్మెల్సీ స్థానాలు, మే 1 నాటికి ఏడు స్థానాలు, జూలై 20 నాటికి మరో రెండు స్థానాలు కలిపి మొత్తం 23 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వనున్న నేపథ్యంలో మొత్తం 23 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు వైయస్ జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఒకప్పుడు రద్దు చేయాలని తీర్మానించిన శాసనమండలి ఇప్పుడు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పండుగ వాతావరణం నెలకొల్పుతుంది. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించడానికి సిద్ధమవుతుంది. గతంలో శాసనమండలిలో ఆధిక్యత చాటుకున్న తెలుగుదేశం పార్టీ బలం ఇప్పుడు కేవలం నాలుగు సీట్లకే పరిమితం కానుంది. దీంతో ఒకప్పుడు పరాభవం చవిచూసిన శాసనమండలిలో ఇప్పుడు అదే పార్టీ అత్యంత బలంగా మారటంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది.

ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎమ్మెల్సీలు ఉండగా తెలుగుదేశం పార్టీకి 15 మంది ఎమ్మెల్సీ ఉన్నారు. ఇక ఎనిమిది మంది నామినేటెడ్ సభ్యులు, పిడిఎఫ్ కు నలుగురు, స్వతంత్రులు నాలుగు, బీజేపీకి ఒక స్థానం ఉండగా ఒక స్థానం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న స్థానాల్లో ఐదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీట్లు, 11 తెలుగుదేశం పార్టీ సీట్లు, రెండు భారతీయ జనతా పార్టీ సీట్లు ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైనవి ,గవర్నర్ నామినేషన్ లో ఉన్నవి ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో నలుగురు పార్టీ ఫిరాయించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో బలం ఎక్కువగా ఉండటం, 90 శాతం స్థానిక సంస్థలను కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఈ ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఐదు స్థానాలను నిలుపుకోవటమే కాకుండా తెలుగుదేశం నుండి 11 స్థానాలు, భారతీయ జనతా పార్టీకి చెందిన రెండు స్థానాలు, గవర్నర్ కోటా నుండి ఒకటి కైవసం చేసుకోనుంది.

ఇక పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఇప్పటికే జగన్ ప్రకటించారు. ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. రాష్ట్రంలో అధికార పార్టీకి స్థానిక సంస్థలలో అత్యధిక మెజార్టీ రావడంతో వాటిని కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు.ఎక్కువ మొత్తంలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవటంతో వాటిని కుల సమీకరణాలు ఆధారంగా ఆయా నియోజకవర్గాలలో ఉన్న గ్రూపు రాజకీయాలను బట్టి సర్దుబాట్లను దృష్టిలో ఉంచుకొని జగన్ సీట్లను భర్తీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రద్దు చేద్దామని అనుకున్న శాసనమండలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కేలా చేస్తుండటంతో ఆ పార్టీలో ప్రస్తుతం కోలాహలం నెలకొంది.