సముద్రాల్లో నౌకలకు రక్షణ లేకుండా పోయిందన్న ఎంపీ ఆళ్ల
భూసరిహద్దుల్లో రవాణాకు ఉన్న సంరక్షణ.. సముద్ర సరిహద్దులో జరుగుతున్న నౌక రవాణాకు లేదు – రాజ్య సభలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
చారిత్రకంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల సముద్ర భూభాగాలలో 12 కిలో మీటర్ల మేర మాత్రమే తమ తమ సముద్రాలను సంరక్షించుకునే బాధ్యత ఉంటుందని.. ఈ నేపథ్యంలో అనేక నౌకలు ఆక్రమణలకు, దాడులకు గురి కావటం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ప్రసంగించారు. సముద్ర భూభాగాలలో జరిగే రవాణా నౌకల ఆక్రమణలు, దాడులు, పెట్రోలింగ్, మత్స్యకార సమస్యలను అరికట్టేందుకు (వన్ బోర్డర్ – వన్ ఫోర్స్) (ఒకే సరిహద్దు – ఒకే పరిరక్షణ సైన్యం) పేరుతో రెండు వందల కిలో మీటర్ల వరకు సముద్ర జలాలను సంరక్షించుకునే విధంగా మంచి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో సముద్ర తీరంలో జరిగిన దాడులు, సముద్రపు దొంగలను శిక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. భారతదేశ ఆర్ధిక అభివృద్ధి వ్యవస్థల్లో నౌక రవాణా ఒక ముఖ్యమైన అంశం అన్నారు. 2000 సంవత్సరంలో మంత్రిత్వ శాఖ
ఒక కమిటీని ఏర్పాటు చేసి, సముద్ర సరిహద్దుల్లో ఏర్పడే సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగిందన్నారు. ఆ నివేదికలో రాష్ట్రాలకు సంబంధించిన పోస్టల్ గార్డ్స్, అదే విధంగా కేంద్రానికి సంబంధించిన నౌక రవాణా సైన్యం సంయుక్తంగా కలిసి పనిచేయాలని సూచించిందన్నారు. ఈ క్రమంలో రెండు శాఖల సమన్వయ లోపంతో అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యాయని తెలిపారు. కాబట్టి సంబంధిత శాఖలు అన్ని కూడా సమన్వయ లోపాలు లేకుండా ఒకే పరిధిలో సంయుక్తంగా పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తే.,.. ఆ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం బలుపరుస్తుందని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెప్పారు.

