ఢిల్లీ మేయర్ ఆప్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. తాజాగా తమ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఆప్ ప్రకటించింది. మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్‌గా మహ్మద్ ఇక్బాల్ పేర్లను పేర్కొంది. తొలిసారి కౌన్సిలర్‌గా షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. అంతకు ముందు ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. పశ్చిమ ఢిల్లీ ఈస్ట్ పటేల్ నగర్ నుంచి ఆమె గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్ ఇండియన్ కామర్స్ అసోసియేషన్‌లో లైఫ్‌టైం మెంబర్‌గా ఉన్నారు. ఇందిరాగాంధీ ఒపెన్ యూనివర్సిటీ నుంచి ఆమె స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో పిహెచ్డి చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ, అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. ఢిల్లీ మేయర్‌గా మహిళకు అవకాశం ఇస్తామని ఇంతకు ముందే ఆప్ ప్రకటించింది. చెప్పిన విధంగానే షెల్లీని ఆ పదవి ఎంపిక చేసింది.

ఆప్ నేత, 6 సార్లు ఎమ్మెల్యే అయిన షోయబ్ ఇక్బాల్ కుమారుడు డిప్యూటీ మేయర్ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఇక్బాల్ 17వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. మేయర్ నామినేషన్లకు ఆఖరి తేదీ డిసెంబర్ 27. జనవరి 6వ తేదీన ఎన్నికలు, ఢిల్లీ మేయర్‌ను మొత్తం మున్సిపల్ కౌన్సిలర్లు, 7 లోక్ సభ ఎంపీలు, 3 రాజ్యసభ ఎంపీలు, వీళ్లతోపాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 250 స్థానాలకుగానూ ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 4 వార్డులను దక్కించుకున్నాయి.

