గోషామహల్‌లో కుంగిన పెద్ద నాలా.. పలువురికి గాయాలు..
గోషామహల్‌లోని చాక్నవాడిలో పెద్ద నాలా కుంగిపోయింది. దీంతో నాలాపై ఉన్న కార్లు, ఆటోలు, బైకులు పడిపోయాయి. నాలాపై ఉన్న దుకాణాలు కూడా నాలాలో పడ్డాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మరోవైపు నాలా కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నడిరోడ్డుపై ఉన్న పెద్దనాలా అర కిలోమీటరు దూరం వరకు కుంగిపోయింది. దుకాణాల్లో ఉన్న కూరగాయాలు, వస్తువులు నాలాలో పడిపోయాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మార్కెట్‌కు వచ్చిన ప్రజలను తరలిస్తున్నారు. నాలా కుంగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

