Andhra PradeshHome Page Slider

దోపిడి లక్ష్యంగానే జగన్ పాలన

◆ ఏపీలో సైకో పాలన
◆ ప్రజల రక్తం తాగే జలగ జగన్
◆ చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన

ఏపీలో సైకో పాలన సాగుతుందని జగన్మోహన్ రెడ్డికి విధ్వంస పాలన తప్ప ఏమీ చేతకాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గురువారం రాజాం విచ్చేసిన చంద్రబాబు రోడ్డు షోలో మాట్లాడుతూ వైసీపీ పాలన జగన్మోహన్ రెడ్డి పాలనా తీరుపై విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజల రక్తం తాగే జలగ జగన్మోహన్ రెడ్డి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలన రాష్ట్రానికి పట్టిన కర్మగా అభివర్ణించారు. వైసీపీ పాలనతో జనం విసుగు చెందారని ఇక సైకో పాలన వద్దనుకొని సైకిల్ పాలన రావాలని అంతా కోరుకుంటున్నారన్నారు. సంక్షేమ పథకాల పేరిట ఉదయం బటన్ నొక్కి సాయంత్రం మద్యం విక్రయాల రూపంలో దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు కట్టే పరిస్థితి అసలు లేనేలేదని ఎద్దేవా చేశారు. దోపిడీ చేయడం తప్ప జగన్ ఏపీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. చెత్త పై పన్ను వేసిన ఘనత జగన్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

అన్నింటికీ మించి అధికారం శాశ్వతం కాదని జగన్ తెలుసుకోలేకపోయారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని… టీడీపీని అధికారంలోకి తేవాలని భావిస్తున్నారన్నారు. అమరావతి రాజధాని ఒక్కటే అభివృద్ధికి దోహదపడుతుందని కానీ జగన్ మూడు ముక్కలాటకు పెద్దపీట వేసి సుప్రీంకోర్టును సైతం తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. నిరుద్యోగం పెరిగిపోయిందని రాష్ట్రంలో దోపిడీ రాజ్యమే నడుస్తుందని అక్రమ కేసులు పోలీసులు వేధింపులు కూడా ఎక్కువయ్యాయని ఈ సందర్భంగా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటన భాగంగా రాజాం కు చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. రాజాంలో రోడ్ షో ముగిసే వరకు ఎక్కడ చూసినా జన సందోహమే కనిపించింది. మూడు రోజులు పర్యటనలో భాగంగా మొదటిరోజు సభ సక్సెస్ అవడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నాయి.