Andhra Pradesh

ముందస్తు ఖాయం.. ట్రిపుల్ ఆర్ జోస్యం

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నరసాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణం రాజు తెలిపారు . కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటు, లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే జరగవచ్చునని పేర్కొన్నారు. 20 24 లో పార్లమెంట్ ఎన్నికల తో పాటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగవనేది ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే తేటతెల్లమవుతుందన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎంపీలను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడ్డిపోచతో సమానంగా చూస్తారని విమర్శించారు.. అయితే వంద రోజులే ఎన్నికలకు సమయమని చెబుతూ ప్రస్తుతం ఎమ్మెల్యేలకు కాసింత గౌరవం ఇచ్చి సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు.

జగనన్న గృహ హింస పథకం

జగనన్న గృహ హింస పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇకపై మరో ఇద్దరు గృహ సారధులను నియమించనుంది. ఈ గృహ సారధులు, వాలంటీర్ సమన్వయంతో పనిచేస్తూ… ప్రజల బ్రెయిన్ వాష్ చేయనున్నారు. ప్రజలను ఏ సమయంలోనైనా వెళ్లి డిస్టర్బ్ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వీరికి కట్టబెడుతోందన్నారు.

రాచరికపు వ్యవస్థలోనూ ఇంతటి అరాచక పాలన లేదు

రాచరికపు వ్యవస్థలోనూ ఇంతటి అరాచక పాలన కొనసాగలేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. వాలంటీర్లు ప్రజలని ఇళ్లల్లో ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. గృహ సారధులు వారిని తమ మాటలతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు యాప్ సిద్ధం చేస్తున్నా

రాష్ట్రంలో ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం ఒక యాప్ ను తనవంతుగా సిద్ధం చేస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ యాప్ లో ఆధార్ నెంబర్ నమోదు చేస్తే, ఓటరు జాబితాలో పేరు ఉన్నది.. లేనిది సునాయాసంగా తెలుసుకోవచ్చు. ఈ మేరకు ఐటీ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు.

అప్రూవర్ గా మారిన అల్లుడు… మామ గుట్టురట్టు

మామ పుణ్యమా అని దేశంలోనే అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలలో ఒకటైన అరబిందో ఫార్మా యజమాని తనయుడు ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు . వివేకానంద రెడ్డి హత్య కేసులో షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారి, హత్యలో ఎవరెవరు పాల్గొన్నది పూసగుచ్చినట్లు వివరించినట్లుగానే ప్రస్తుతం జైల్లో ఉన్న అల్లుడు మామ గుట్టు రట్టు చేసినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయన్నారు.

వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలి

వాల్మీకి బోయలను ఎస్టీ లో చేర్చాలని తాను లోక్ సభలో కోరానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్న వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి, ఆ మాట తమ పార్టీ పెద్దలు మర్చిపోయారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉందన్నారు.

రెండున్నర కోట్ల రూపాయలని వెనక్కి ఇవ్వాలి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల నిర్వహణ కోసం ప్రజాధనం నుంచి కేటాయించిన రెండన్నర కోట్ల రూపాయలను, ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో సంపాదించారు. ఆ డబ్బుల లోంచి 10 కోట్లు వెచ్చించి, తన జన్మదిన వేడుకలను నిర్వహించుకోవచ్చు. అంతేకానీ రెండున్నర కోట్ల ప్రజాధనాన్ని జన్మదిన వేడుకల పేరిట దుర్వినియోగం చేయవద్దన్నారు.