కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో చైనా వణికిపోతోంది. చాలా నగరాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతుండడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. చైనా జీరో కోవిడ్ నిబంధనలను సడలించిన తర్వాత నుంచి కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం అక్కడ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. వచ్చే మూడు నెలల్లో ఆ దేశంలో 60 శాతం మందికి పైగా వైరస్ బారిన పడతారని నిపుణులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చైనాలో ప్రస్తుతం మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నప్పటికీ.. అధికారిక సంఖ్య మాత్రం బయటకు రావట్లేదని తెలిపారు. కరోనా కోరల నుంచి బయటపడిన ప్రపంచంపై మరోసారి వైరస్ పంజా విసురుతుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతాయని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంచనా వేశారు. ప్రపపంచానికి మరో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.