Home Page SliderInternationalSports

పోరాడి ఓడిన టీమిండియా … సిరీస్‌ బంగ్లాదే

మీర్పూర్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌పై 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే బంగ్లాదేశ్‌ కైవసం చేసుకుంది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ 82 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. గాయం కారణంగా భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి పోరాడనప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు రోహిత్‌. ఓపెనర్‌గా వచ్చిన విరాట్‌ కోహ్లీ 5 పరుగులు చేసి ఎబాదత్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 13 పరుగుల వద్ద  8 పరుగులు చేసిన ధావన్‌ ముస్తిఫిజుర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

బంగ్లా బౌలర్లలో ఎబాడోత్‌ హుస్సేన్‌ మూడు వికెట్లు పడగొట్టగా… మెహదీ హసన్‌ రెండు, ముస్తిఫిజుర్‌, మహ్మదుల్లా తలా వికెట్‌ సాధించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి బంగ్లా 271 పరుగులు చేసింది. తొలి వన్డేలో రాణించిన మెహిదీ హసన్‌ మిరాజ్‌ మరోసారి మెరిశాడు. 4 సిక్సర్లు, 8 ఫోర్లతో సెంచరీ చేయగా ఆల్‌ రౌండర్‌ మహమ్మదుల్లా 77 పరుగులతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 3, సిరాజ్‌ 2, ఉమ్రాన్‌ మాలిక్‌ 2 వికెట్లు తీశారు.