Home Page SliderNational

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలుపు

ఊహించినట్టుగానే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఐతే బీజేపీ ఊహించినంత ఘోరంగా ఏమీ ఓడిపోలేదు. కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ గత ఎన్నికలతో పోల్చుకుంటే సగానికి సగం తగ్గింది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) కోసం జరిగిన ప్రతిష్టాత్మక పోరులో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ గెలిచింది. 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాల్టీని ఏలుతున్న బీజేపీని ఓడించి సంచలనం సృష్టించింది. 250 స్థానాల్లో 134 స్థానాలను గెలుచుకుంది. 250 మంది సభ్యుల సభలో మెజారిటీ కంటే ఎనిమిది ఎక్కువ గెలుపొందింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖంతో ప్రచారాన్ని నిర్వహించిన బీజేపీ 104 సీట్లతో సరిపెట్టుకొంది. కాంగ్రెస్ కేవలం తొమ్మిది డివిజన్లకు పడిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ పునాది అంతకంతకూ క్షీణిస్తూనే ఉంది. 2017 MCD ఎన్నికలలో – మొత్తం 272 వార్డులలో 181 వార్డులను BJP గెలుచుకున్నప్పుడు, AAP 48 మాత్రమే గెలుచుకోగలిగినప్పుడు – కాంగ్రెస్ 30 స్థానాల్లో విజయం సాధించింది.

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల విజయంతో… AAP కార్యాలయంలో మద్దతుదారులు ధోల్ బీట్‌లకు నృత్యం చేస్తూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేషధారణలో సంబరాలు జరుపుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినదానికి భిన్నంగా… బీజేపీ పోటీ ఇవ్వడంతో ఆప్ నేతలు ఒకింత ఉత్కంఠకు గురయ్యారు. ఐతే బీజేపీని గద్దె దించడం ఆప్ విజయంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆరంభంలో పంజాబ్‌లో మళ్లీ కాంగ్రెస్‌పై విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆప్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఓడించిందని.. బీజేపీని ఓడించలేదన్న దానికి ఈ ఎన్నికలు నిదర్శనమని ఆప్ నాయకుడు చెప్పారు. గత 24 ఏళ్లలో బీజేపీ… ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనప్పటికీ, కాంగ్రెస్, ఆప్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ… ఢిల్లీ మున్సిపాల్టీపై మాత్రం బీజేపీ పట్టు కోల్పోలేదు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ ఆప్ రికార్డు స్థాయిలో 67 సీట్లు గెలుచుకున్నప్పటికీ, రెండేళ్ల తర్వాత బీజేపీ ఎంసీడీని నిలబెట్టుకుంది. దాదాపు 10 సంవత్సరాల క్రితం MCDని ప్రాంతాల వారీగా మూడుగా విభజించినా… ఒక్కటిగా చేసిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి.

దాదాపు 1,300 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ప్రధాని మోదీ పోస్టర్లతో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రులను కూడా మోహరించింది. రెండు ప్రధాన పార్టీలకు స్థానిక నాయకులు దూరమయ్యారు. గత ఏడాది ప్రారంభం నుంచి ఆప్ మున్సిపల్ ఎన్నికలకు తగిన విధంగా సిద్ధమైంది. చెత్త సమస్యపై నేరుగా బీజేపీని ఢీకొట్టింది. రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామన్న ఆప్.. ఇప్పుడు పారిశుధ్యాన్ని కూడా మెరుగుచేస్తామంది. “కేజ్రీవాల్ ప్రభుత్వం, కేజ్రీవాల్ కార్పొరేటర్” అనే నినాదం BJP “మోదీ డబుల్ ఇంజన్” పోటీగా నిలిచింది. ఇళ్లకు సంబంధించి బీజేపీ పెద్ద ఎత్తున హామీలు గుప్పించింది. అదే సమయంలో పలువురు ఆప్ మంత్రులపై అవినీతి ఆరోపణలపై ఒత్తిడి తెచ్చింది. ఆప్‌పై దుమ్మెత్తిపోసేందుకు కాంగ్రెస్ వీటిని ఉపయోగించుకుంది. అయితే, ముఖ్యమంత్రిగా తన అద్భుతమైన పనిని బూటకపు ఆరోపణలతో… కేంద్ర సంస్థల దుర్వినియోగం చేస్తున్నాయంటూ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ కనీసం కొంత ప్రాబల్యం పొందాలని ఆశించింది, కానీ మరింత దిగజారింది. 2014లో క్షీణత ప్రారంభమైన తర్వాత, 2019లో షీలా దీక్షిత్ మరణం తర్వాత ఢిల్లీలో రోజు రోజుకు క్షీణిస్తోంది.