ముస్లింల ఫార్ములాను హిందువులూ అనుసరించాలి
పెళ్లిళ్ల విషయంలో ‘ముస్లింల ఫార్ములా’ను హిందువులు కూడా అనుసరించాలంటూ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐడీయూఎఫ్) అధినేత, అస్సాం ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ మరో వివాదానికి తెర లేపారు. ముస్లిం పురుషులు 20-22 ఏళ్లకే.. ముస్లిం యువతులు 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంటారని.. దీంతో తప్పుదోవ పట్టే అవకాశం ఉండదని చెప్పారు. హిందువులు మాత్రం పెళ్లికి ముందే ఒకరు, ఇద్దరు, ముగ్గురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని.. పిల్లలను కనకుండా జల్సా చేస్తారని వివరించారు. ఎంజాయ్ పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఒత్తిడితో ఎప్పుడో 40 ఏళ్లకు పెళ్లి చేసుకుంటారని.. ఇక అప్పుడు పిల్లలు ఎలా పుడతారని ప్రశ్నించారు. సైన్స్ ప్రకారం కూడా సరైన సమయంలో పెళ్లి చేసుకొని.. సరైన సమయంలో పిల్లలను కనడమే ఆరోగ్యదాయకమని తెలిపారు.

‘లవ్ జిహాద్’పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలపైనా అజ్మల్ స్పందించారు. హిందువులు కూడా లవ్ జిహాద్ చేయొచ్చని.. దమ్ముంటే నలుగురైదుగురు ముస్లిం యువతులను తీసుకెళ్లొచ్చని.. ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దేశానికి నరేంద్ర మోదీ వంటి పవర్ ఫుల్ ప్రధాని కావాలని.. లేకుంటే నగరానికి ఒక ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా వెలుస్తాడని.. లవ్ జిహాద్‌తో హిందూ యువతులను వలలో వేసుకొని, మట్టుబెడతాడని హిమంత బిస్వా శర్మ చెప్పారు.

