NewsTelangana

మార్కెట్‌లోకి టెస్లా భారీ ఎలక్ట్రిక్‌ ట్రక్కు

ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో దూసుకెళ్తున్న టెస్లా కంపెనీ మరో ఎలక్ట్రిక్‌ ట్రక్కును తయారు చేసింది. తొలి హెవీ డ్యూటీ సెమీ ట్రక్కును టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్‌ ట్రక్కుగా నిలిచింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 37 వేల కిలోల బరువుతో 800 కిలోమీటర్ల వరకూ ప్రయాణించడం ఈ ట్రక్కు ప్రత్యేకత. తెల్ల రంగులో ఒకటి.. పెప్సికో లోగోతో మరొకటి.. ఫ్రిటో లే రంగుతో ఇంకో ట్రక్కును తయారు చేశారు. ఇది 20 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆటోమేటిక్‌ క్లచ్‌, రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వంటి ఫీచర్లు కూడా దీనికి ఉన్నాయి.

హైవేపై కర్బన ఉద్గారాలను తగ్గించే ఈ ట్రక్కు ధరను 1,50,000 డాలర్లుగా నిర్ధారించారు. పెప్సికో ఇప్పటికే 100 ట్రక్కులకు ఆర్డర్‌ ఇచ్చింది. వాల్‌మార్ట్‌, ఫెడెక్స్‌ తదితర కంపెనీలు కూడా ఆర్డర్‌ చేసినట్లు టెస్లా సంస్థ ప్రకటించింది. 2024 నాటికి 50 వేల ఎలక్ట్రిక్‌ ట్రక్కులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు టెస్లా ప్రకటించింది. ఒక మెగా వాట్‌ కరెంటుతో దీన్ని చార్జింగ్‌ చేయొచ్చని.. ఫాస్ట్‌ చార్జింగ్‌ కేబుల్‌, లిక్విడ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ కూడా ఉన్నాయని పేర్కొన్నది. అయితే.. బ్యాటరీతో తయారైన ఈ ట్రక్కు వేలాది కిలోల బరువును మోయగలదా..? అని ఆటోమొబైల్‌ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.