రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాం జగనన్న కాలనీలు
◆అధికార పార్టీ నాయకులు కోట్లు దోచుకున్నారు
◆ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికే జనసేన సోషల్ ఆడిట్
◆ఈ నెల 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమం
◆మీడియాతో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
ఏపీలో అతిపెద్ద స్కాం జగనన్న కాలనీలు అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. భూమి కొనుగోలు, మౌలిక వసతుల పేరిట, జగన్ ప్రభుత్వం వేల కోట్ల అవినీతి చేసిందన్నారు. జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈనెల 12, 13, 14 తేదీల్లో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఒకచోట ఈ కార్యక్రమంలో పాల్గొని జగనన్న కాలనీలను పరిశీలిస్తారని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల 30 వేల మందికి ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అందులో భాగంగా తొలి విడుతగా 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారని ఆయన చెప్పిన గడువు ముగిసి ఐదు నెలలు కావస్తుందని రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక ఇళ్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికే జనసేన సోషల్ ఆడిట్ ను నిర్వహిస్తోందన్నారు. గృహనిర్మాణ పథకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవేనని ఈ ఇళ్లనిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇసుకను మాత్రమే ఉచితంగా అందిస్తుందని అది కూడా ఇసుక రవాణాకు అయ్యే ఖర్చు లబ్ధిదారుడే భరించాలని ఆంక్షలు పెట్టిందని ఇస్తున్న ఇసుక కూడా ఎక్కడ నుంచి తెచ్చుకోవాలో స్పష్టత ఇవ్వడంలేదని తెలిపారు. జగనన్న ఇళ్ల పేరిట గత మూడున్నరేళ్లుగా జరుగుతున్న దోపిడీని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జనసేనపై ఉందని మనోహర్ అన్నారు.


