Andhra PradeshNews

అయ్యన్నపాత్రుడి అరెస్టు.. టీడీపీ నిరసనలు

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఐడీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేసిన కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్‌, మూడో నిందితుడిగా రాజేష్‌ ఉన్నారు. దీంతో అయ్యన్నపాత్రుడి ఇంటిని గురువారం వేకువజామునే చుట్టుముట్టిన పోలీసులు గోడ దూకి ఆయన ఇంట్లోకి బలవంతంగా దూసుకొచ్చారు. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు చింతకాయల రాజేష్‌కు నోటీసులు ఇచ్చి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పలు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన తండ్రీకొడుకులను ఏలూరు కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు చెప్పారు.

రాక్షసుడిలా జగన్‌..

అయ్యన్న పాత్రుడి అరెస్టు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. టీడీపీలోని బీసీ నేతలను వైసీపీ టార్గెట్‌ చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. తలుపులు బద్దలు కొట్టి.. లోపలికి దూసుకొచ్చి.. దుస్తులు మార్చుకునే అవకాశం ఇవ్వకుండా, కనీసం చెప్పులు కూడా వేసుకోనీయకుండా అయ్యన్నపాత్రుడిని, రాజేశ్‌ను తోసుకుంటూ తీసుకెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుటుంబాన్ని పోలీసులు ఏదో సాకుతో మూడేళ్లుగా వేధిస్తున్నారని అయ్యన్న పాత్రుడి భార్య పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు, కుమారుడికి ప్రాణహాని ఉందని.. వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌ సీఎంలా కాకుండా.. రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని టీడీపీ శ్రేణులను కోరారు.