బీజేపీ కుట్ర ఫలితమే ఈ ఎన్నికలు: తమ్మినేని
బీజేపీ ఢిల్లీ నుంచి సాగించిన కుట్ర ఫలితమే ఈ ఎన్నికలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. చండూరులో టీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఏడాది తర్వాత జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు ఎందుకొచ్చాయి. నియోజక వర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఇది వాస్తవం కాదు. తాటిచెట్టు ఎందుకెక్కావంటే..? దూడ గడ్డి కోసం అని వెనకటికి ఒకడు అన్నాడట. మన రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అలాగే ఉంది. రాజగోపాల్ రెడ్డి కుంటి సాకులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ అని చూపాలన్నది వాళ్ల లక్ష్యం. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే పార్టీ మారారని ఆయన ఒప్పుకున్నారు. అంతేకాదు.. గత మూడు ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉంటూనే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని రాజగోపాల్ రెడ్డి ఓ టీవీ చానెల్‌లో అంగీకరించారు. ఇలాంటి దుర్మార్గుడు.. బీజేపీ వంటి దుర్గార్మ పార్టీలోకి వెళ్లారు. రాజగోపాల్ రెడ్డిని ఓడించి ఆ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి. హిందువులు తప్ప ముస్లింలు, క్రిస్టియన్లు దేశంలో ఉండొద్దంటున్న బీజేపీని దేశం నుంచి తరిమేయాలి. డబ్బులు ఎరచూపి, ఈడీ, సీబీఐలతో బెదిరించి ఎమ్మెల్యేలను కొంటున్న పార్టీ బీజేపీ’ అని తమ్మినేని వీరభద్రం అన్నారు.