పీవోకేను స్వాధీనం చేసుకుంటాం
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోందా..? గిల్గిట్-బాలిస్థాన్‌ను చేరుకుంటేనే రెండు కేంద్రపాలిత ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యం పూర్తవుతుందన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి..? రాజ్‌నాథ్ సింగ్ గురువారం శ్రీనగర్‌లో జరిగిన శౌర్య దివస్‌లో పాల్గొన్నారు. భారత వాయుసేన 1947 అక్టోబరు 27వ తేదీన శ్రీనగర్‌లో దిగి పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి ప్రసంగించారు.

గిల్గిట్-బాలిస్థాన్‌ను చేరుకున్నప్పుడే లక్ష్యం నెరవేరుతుంది..
జమ్మూకశ్మీర్, లడఖ్‌లలో అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పుడే ప్రారంభించామని.. గిల్గిట్-బాల్టిస్థాన్‌ను చేరుకున్నప్పుడే మన లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలపై పాకిస్థాన్ చేస్తున్న దురాగతాలకు ఆ దేశం పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుందన్నారు. దీన్ని బట్టి పీవోకేను ఆక్రమించుకునేందుకు భారత్ ప్లాన్ చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను ప్రధాని మోదీ రద్దు చేయడం వల్ల జమ్మూకశ్మీర్ ప్రజలపై వివక్ష అంతమైందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.